Aug 09,2023 21:55

ప్రజాశక్తి - ఏలూరుటౌన్‌
          సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయంటూ ఎపి రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కైకలూరు రోడ్‌లోని మాదేపల్లి సెంటర్‌లో రైతులు, కౌలు రైతులు రాస్తారోకో నిర్వహించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించు కోవడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీరందించి పంటలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. రైతులు రాస్తారోకోతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ వారంరోజులుగా సక్రమంగా సాగునీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదేపల్లి, కాట్లంపూడి, లింగారావు గూడెం, జాలిపూడి, చాటపర్రు, వెంకటాపురం పరిధిలో సాగునీరు అందడం లేదని చెప్పారు. ఎకరాకు రూ.15 వేలకుపైగా అప్పులు చేసి పెట్టుబడి పెడితే సాగునీరు లేక భూములు బీటలు వారి ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణ కాలువలోకి సాగునీరు తీసుకురావాలని కోరారు. రైతులకు సాగునీరందించి పంటలు కాపాడకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాడవల్లి రామారావు, బైరెడ్డి లక్ష్మణరావు, తిరుపతి రంగారావు, పైడిపాటి భాస్కరరావు, కూచిపూడి మోహనరావు, బుగ్గల సుబ్రమణ్యం, రైతులు పాల్గొన్నారు.