Oct 16,2023 20:29

కాలువపై నిరీక్షిస్తున్న రైతులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని ఎల్‌ఎల్‌సి ఆయకట్టు కింద పంటలు సాగు చేసిన ఆయకట్టు రైతులు నిరీక్షిస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి ఎల్‌ఎల్‌సి కాలువ నీటి కోసం ఇరిగేషన్‌ కార్యాలయాలు, కాలువల వెంట తిరుగుతూ కష్టాలు పడుతున్నారు. మండలంలో తుంగభద్ర దిగువ కాలువ కింద సుమారు 2800 ఎకరాల రబీ ఆయకట్టు భూమి ఉంది. పిడి డిస్ట్రిబ్యూటరీ కాలువ ఆయకట్టు పరిధిలో పంటలు సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క వర్షాలు లేక, మరోపక్క కాల్వలకు సరైన సమయంలో నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయి. పంటలను కాపాడుకోవడానికి సోమవారం కాలువ గట్టుపై సాగునీటి విడుదల కోసం గంటల తరబడి నిరీక్షించారు. సమాచారం తెలుసుకున్న ఎల్‌ఎల్‌సి గోనెగండ్ల సెక్షన్‌ జెఇ ఉదయ భాస్కర్‌ రైతులు వేచి ఉన్న కాలువ దగ్గరికి వెళ్లి రైతులతో మాట్లాడారు. విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నామని, ప్రస్తుతం నీరు కోడుమూరుకు వెళ్తోందని, ఐదు రోజుల తర్వాత వంతు రాగానే పిడి కాలువకు నీటిని విడుదల చేస్తామని రైతులను సముదాయించారు.