Oct 20,2023 21:54

ఇరిగేషన్‌ డిఇ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రైతులు

ప్రజాశక్తి - పార్వతీపురం రూరల్‌ :  చెంతనే జంఝావతి దిగువ కాలువ ఉన్నప్పటికీ నీరు లేక చేలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని, వెంటనే సాగునీరు విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం అడ్డాపుశిల, వెంకటరాయుడిపేట గ్రామాలకు చెందిన రైతులు జంఝావతి డిప్యూటీ ఇంజనీరింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ఎపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్‌ బంటు దాసు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వేణుగోపాల్‌కు వినతి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోలెవెల్‌ కెనాల్‌ 21వ కాలువ వద్ద నీరు అందకపోవడంతో సుమారు 1500 ఎకరాల ఆయకట్టు పొట్ట దశలో ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కాలువ పరిస్థితిని పరిశీలించి సాగునీరు విడుదల అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనికి స్పందించిన అధికారులు వర్షాలు లేకపోవడంతో జంఝావతికి ఇన్‌పుట్‌ ప్రవాహం తగ్గిందని, దీనివల్ల డిమాండ్‌ మేరకు నీటి సరఫరా చేయలేకపోతున్నామని తెలిపారు. సరఫరా అయిన నీటిని రైతులు ఎక్కడికక్కడ ఇసుక బస్తాలు వేసి తమ చేలకు మళ్లించుకోవడంతో శివారు ప్రాంతాలకు నీరు చేరడం లేదని తెలిపారు. దీనిపై లస్కర్లను అప్రమత్తం చేసి శివారు భూములకు నీరందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.