Sep 22,2023 23:56

ప్రజశక్తి - చీరాల
దండుపాట రోడ్డులోని దరివాద, చిట్టివాద రైతులకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. పట్టణంలోని కారంచేడు గేటు వద్ద సాగునీటి కోసం రోడ్డు ఎక్కి రైతులు ఆందోళన చేశారు. పోలీస్‌ 30యాక్ట్ అమల్లో ఉన్నందున రోడ్డుపై ఆందోళనలు, ధర్నాలు చేస్తే అదుపులోకి తీసుకుంటామని సీఐ సోమశేఖర్  రైతులను హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న రైతులను ఆ ప్రాంతం నుంచి  పోలీసులు చెదరగొట్టారు. దీంతో రైతులు ఇరిగేషన్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. సాగునీటి కోసం పంటలు ఎండుతున్నాయని ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెడతామంటూ సీఐ సోమశేఖర్ బెదిరించిన తీరు దుర్మార్గమని రైతులు అన్నారు. తాము రాజకీయ నాయకులం కాదని, పంటలు ఎండుతున్నాయనే ఆవేదనతో తమ బాధలు చెప్పుకుంటున్నామని అన్నారు. నారు మడులు వేసుకుని నీటి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. మూడు నెలలుగా ఇరిగేషన్ అధికారులు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతోనే రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో నీళ్లు ఇవ్వాలని కోరారు. అనంతరం ఏఈ పవన్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకట్రావు, సుబ్బారావు, బాబురావు, జయరత్నం, వాసు, విమలాకర్, కృష్ణ పాల్గొన్నారు.