
ప్రజాశక్తి - బాపట్ల
సాగునీటి కోసం రైతుల మధ్య వివాదాలు రేగుతున్నాయి. ఎగువ రైతులు నీటిని వాడుకుని దిగువ రైతులకు అన్యాయం చేస్తున్నారంటూ రైతులు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. రైతుల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. వరి పొలాలకు నీరు అందించాలని కంకటపాలెం, నర్సాయపాలెం రైతులు గురువారం బాపట్ల రూరల్ పోలీసులను ఆశ్రయించారు. నెల రోజులుగా వరి పొలాలకు నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. బాపట్లలో అసలు ఇరిగేషన్ శాఖ ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. వ్యవసాయ పనులకు ముందు సాగునీరు అందిస్తాం, నాట్లు వేసుకోండని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం నీటి సంగతి ఏంటని అడిగితే కాలువలపై పర్యవేక్షణకు రావడమే మానేశారని తెలిపారు. కంకటపాలెం, నర్సాయపాలెం పొలాలకు పంట నీరు అందించే పాపయ్య కాల్వకు రైతుల మీద ఎకరానికి రూ.వంద రైతుల వద్ద నుండి వసూలు చేసి మరమ్మత్తులు చేయించామని తెలిపారు. నీరు విడుదల చేసి వారాబంధి విధానంతో పొలాలకు నీరు పెట్టుకోవాలని కలెక్టర్ సూచిస్తున్నారని గుర్తు చేశారు. కాలువల ద్వారా వస్తున్న నీటిని కాలువ కట్టదరి పొలాల రైతులు వారాబందీ విధానానికి గండి కొట్టి మోటార్లు పెట్టుకుని దిగువ పొలాలకు నీటిని రానీయకుండా ఎగువ పొలాలకు నీరు పెట్టుకుంటున్నారని దిగువ పొలాల రైతులు పోలీసులకు పిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని బాపట్ల రూరల్ సీఐ వేణుగోపాలరెడ్డికి విన్నవించుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి అక్కడ సాగునీటి సమస్యను వివాదాలు లేకుండా పరిష్కరించేందుకు అవసరమైతే తన సిబ్బందిని పంపుతామని సిఐ వేణుగోపాలరెడ్డి రైతులకు చెప్పి పంపారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు కొమ్మమూరు పరివాహక పంట కాలువలను పర్యవేక్షించాలని కోరారు. వారాబంది విధానాన్ని పటిష్టంగా అమలు చేసి ఎండిపోతున్న వరి పైరుకు ప్రాణం పోయాలని రైతులు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రైతుల్లో సాధుబాబు, చెల్లి బుజ్జి, మువ్వ శ్రీను, యార్లగడ్డ అప్పారావు, మీరయ్య, రమణబాబు, నరసాయపాలెం, కంకటపాలెం రైతులు ఉన్నారు.