ప్రజాశక్తి-కాజులూరు, తాళ్లరేవు సకాలంలో సాగునీరు అందించాలని కోరుతూ కాజులూరు, తాళ్లరేవు మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున మంగళవారం ధర్నా చేశారు. కౌలు రైతులు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజశేఖర్, వల్లు రాజబాబు మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఇంజరం వంతెన కుంగి పోవడంతో ప్రక్కనే రూ.83 లక్షలతో తాత్కాలిక వంతెన నిర్మించారన్నారు. తరచూ వంతెన వద్ద చెత్తాచెదారం అడ్డుకుపోయి సాగు నీరు సకాలంలో అందక అనేకమంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే కాలువల ద్వారా సాగునీరు సరఫరా ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా 40 శాతం కూడా నారుమళ్లు వేయలేదన్నారు. వంతెన నిర్మాణంలో ఆర్ అండ్ బి అధికారులు తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే తాత్కాలిక వంతెన తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ధర్నా చేస్తున్న రైతులకు మాజీ నీటి సంఘం అధ్యక్షులు దంతులూరు వెంకట నరసింహారాజు, భూపతిరాజు రామచంద్రరాజు, దాట్ల బుచ్చిబాబు సంఘీభావం తెలిపారు. తాళ్లరేవు మండలంలోని 18 వేల ఎకరాలకు తొలకరిలోనే నీటి ఎద్దడి దాపురించిందన్నారు. ఈ కల్వర్టు దగ్గర గుర్రపు డెక్క, తూముల్లో మట్టి చేరుకుపోవడం వల్ల కింద పొలాలకు నీరు వెళ్లడం లేదన్నారు. అందువల్ల కల్వర్టు తొలగించాలని, అప్పటివరకు ప్రతిరోజు సక్రమంగా గుర్రపు డెక్క తీయాలని, వంతెన వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనిపై సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులతో చర్చలు జరిగాయి. నీటిపారుదల శాఖ గుర్రపు డెక్క తీసేలా, తూముల్లో పూడిక ఆర్ అండ్ బి అధికారులు తీసే విధంగా హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే కాలువలోని గుర్రపు డెక్కను ఇరిగేషన్ సిబ్బంది తొలగించారు. ఇరిగేషన్ డిఇ హిమ రత్న, ఎఇ ఈశ్వర్, ఆర్ అండ్ బి డిఇ వర్మ, ఎఇ లక్ష్మీ ప్రసన్న రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందికోళ్ల సత్తిబాబు, బోండా ప్రసాద్, పెద్దిరెడ్డి రాజు, మారెళ్ల నరసింహ నాయుడు, పాలెపు ఈశ్వరరావు, పితాని సత్యనారాయణ, గుత్తులు చిన్నయ్య, గుబ్బల వెంకటరమణ, పిల్లి నాని, శీలం శ్రీనివాసు, కన్నీడి లక్ష్మణరావు, గుబ్బల పండు, పలివెల ఏడుకొండలు, మేడిశెట్టి గోవిందు, నంది కోళ్ల ప్రసాదు, సూర్య భాస్కరరావు, దడాల అబ్బులు, రెడ్డి గోవిందు, రెడ్డి శ్రీనివాసు పాల్గొన్నారు.










