
ప్రజాశక్తి-నెల్లూరు :జిల్లాలో రబీ సీజన్‌లో పంటల సాగుబడికి అవసరమైన నీటిని ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి వ్యవసాయాన్ని పరిరక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని రైతు సంఘం నాయకులు షాన్‌వాజ్, రమణయ్యలు డిమాండ్ చేశారు. గురువారం నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు . ఈ సందర్బంగా అఖిలపక్షం రైతు సంఘం, ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్లు గంగపట్నం రమణయ్య, ఎస్ కే.షాన్ వాజ్‌లు మాట్లాడుతూ జిల్లాలో రబీ సాగు ప్రారంభమై నెల రోజులు కావస్తుందన్నారు. రైతాంగం తమ పంటలు సాగుబడి చేసుకొనేందుకు సరిపడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి సాగునీట తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రభీ సీజన్‌లో వరి సాగుబడి చేసేందుకు అనుకూలంగా ఉంటుందని, ఈ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాదాపుగా పూర్తియిందన్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 6 లక్షల ఎకరాలలో రైతులు వరి నాట్లు వేసి సాగుబడి చేస్తున్నారన్నారు. ఈ సాగు ద్వారా జిల్లాలో 20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతాంగం దిగుబడి చేస్తుందన్నారు. సోమశిల ప్రాజెక్టు ద్వారా ఎమర్జెన్సీ ప్రక్రియలో వరి పంటకు విడుదలచేసే రైతాంగానికి ఆదుకోవచ్చున్నారు. అందుకు భిన్నంగా మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టులో నీటి శాతం తక్కువ ఉన్నాయని, కేవలం తాగునీటికి మాత్రమే నీటిని విడుదల చేస్తాననడం ఎంతవరకు సబబు అన్నారు. ఇప్పటికే సాగు బడికి ఆధుని మించిపోయిందన్నారు. విద్యుత్ మోటార్ల క్రింద రెండు లక్షల ఎకరాలకు సరిపడా రైతుల నార్లు పోసుకొని ఉన్నారని, మిగిలిన నాలుగు లక్షల ఎకరాలకి 5 టిఎంసిల నీరు కావాల్సి ఉందన్నారు. రైతుల సమస్యలు మంత్రులు, పట్టించుకోవడంలేదని, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు న్యాయమన్నారు. తక్షణమే కాలువలకు మరమ్మత్తులు జరిపించి, వారం రోజుల్లో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు వెంకటరమణయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.