దాళ్వాలో పూర్తి ఆయకట్టుకు నీరు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4.60 లక్షల ఎకరాల్లో సాగు
101 టిఎంసిల గోదావరి నీరు అందుబాటులో ఉన్నట్లు లెక్కలు
30వ తేదీ నుంచి సాగునీరు విడుదలకు సన్నాహాలు
జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ఊసే కరువు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
గోదావరిలో పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉండటంతో దాళ్వాలో రెండు జిల్లాల్లోనూ పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ప్రతియేటా సాగునీటి సరఫరాపై పెద్దఎత్తున చర్చ సాగేది. పూర్తి ఆయకట్టుకు నీరందించాలా వద్దా.. అందిస్తే ఏవిధంగా అందించాలనే దానిపై తర్జనభర్జనలు జరిగేవి. ఈ ఏడాది అటువంటి పరిస్థితి లేదని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాళ్వాలో 4.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల ఆయకట్టులో రైతులు పంటను సాగు చేస్తున్నారు. రెండు జిల్లాల మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే దాదాపు 83 టిఎంసిలు నీరు అవసరం. ప్రతియేటా నవంబర్ నెలాఖరు వచ్చేసరికి గోదావరిలో నీటిలభ్యత లెక్కల ప్రకారం 61 టింఎసిల నీరు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ నీరు కేవలం 74 శాతం ఆయకట్టుకు మాత్రమే సరిపోతుందని, మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే కష్టమని అధికారులు తేల్చేవారు. జిల్లా సాగునీటి సలహామండలి సమావేశాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ సాగేది. దీంతో సీలేరు జలాలను లెక్కలుగట్టి వంతులవారీ విధానంలో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించేవారు. అడ్డుకట్టలు ఎక్కడ వేయాలి వంటి ప్రణాళికలు రూపొందించేవారు. జిల్లాలో 11 ప్రధాన కాలువలు, 300కు పైగా పిల్లకాలువల ద్వారా సాగునీటి సరఫరా సాగుతోంది. దీంతో ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చించేవారు. ఈ ఏడాది అటువంటి క్లిష్టపరిస్థితులు లేవని సాగునీటి లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహాల లెక్కల ప్రకారం 101 టిఎంసిల నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తేల్చారు. దీంతో దాళ్వాకు సాగునీటి కొరత ఉండదని తేలిపోయింది. జనవరి తర్వాత నీటి ప్రవాహాల ఆధారంగా వంతుల వారీ విధానం అమలు చేయాలా వద్దా అనేది నిర్ణయించే అవకాశం ఉంది. సాగునీటి కొరత లేదని తెలియడంతో రైతులు సైతం దాళ్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు.
30న సాగునీరు విడుదలకు సన్నాహాలు
ప్రతియేటా దాళ్వాకు సాగునీటి సరఫరాపై జిల్లాలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితోపాటు జిల్లాలోని మంత్రులు, ఎంఎల్‌ఎలు, కలెక్టర్, జెసితోపాటు అధికారులంతా పాల్గొంటారు. సాగునీటి సరఫరా, సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ నెల 30న దాళ్వాకు సాగునీరు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే జిల్లాలో మాత్రం ఇప్పటికీ సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహణపై ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నెల 30న జిల్లాలో ఐఎబి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు సాగునీటిని విడుదల చేయనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా సమావేశంలో ప్రకటించడంతో సమావేశం నిర్వహిస్తారా అనే అనుమానం కలుగుతోంది.
వెంటాడుతున్న ఆధునికీకరణ సమస్య
గడిచిన మూడేళ్లలో జిల్లాలో పంట కాలువలకు సంబంధించి ఎటువంటి ఆధునికీకరణ పనులూ జరగలేదు. దీంతో చాలా పంట కాలువలు మెరకతేలిపోయి ఉన్నాయి. దాళ్వాలో సాగునీరు కిందకు పారక ప్రతియేటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారీ అటువంటి ఇబ్బందులు తప్పవని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పవా అనే పరిస్థితి నెలకొంది. సాగునీటికి ఇబ్బంది లేకుండా అత్యవసర పనులు వెంటనే చేయాలని రైతులు కోరుతున్నారు.










