ప్రజాశక్తి- ఆనందపురం: సాగునీరు ఆధారంగాపంటలు వేసుకుంటే తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చునని భూగర్భ జలవనరుల శాఖ జిల్లా అధికారి డి.లక్ష్మణరావు అన్నారు. మంగళవారం మండలంలోని పెద్దిపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకంలో భాగంగా ఆయకట్టు రైతులకు భూగర్భ జలవనరులశాఖ, శారద వ్యాలీ డెవలప్‌మెంట్ సమితి సమన్వయంతో పంట నీరు ప్రణాళికపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఖరీఫ్ పూర్తికాగానే, రబీ ప్రారంభసమయంలో పంటల ప్రణాళిక తయారీపై శిక్షణనిచ్చారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.రమేష్‌బాబు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న సాగునీటి ఆధారంగా ముందస్తుగా రబీ పంటల ప్రణాళిక వేసుకోవాలన్నారు. భాస్కరదేవ్ మాట్లాడుతూ ఆరుతడి, వాణిజ్య, కూరగాయలు పంటల సాగుతో ఆర్థికంగా లాభపడొచ్చన్నారు. జలవనరుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రపంచ బ్యాంకు సహకారంతో చింతల చెరువు అభివృద్ధి పనులను వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎఇ రమణమూర్తి, హార్టీకల్చర్, భూగర్భజలవనరులు, వ్యవసాయశాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










