ప్రజాశక్తి - సంతమాగులూరు
మండలంలోని కొప్పరం, బండివారిపాలెం గ్రామాలలో మెట్ట భూముల్లో బావులు, విద్యుత్ మోటార్ల కింద మిర్చి సాగు చేసిన రైతులు సాగునీరు అందక వేసిన ఫైర్లు ఎండు ముఖం పట్టడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒక ఎకరానికి రూ.ఒక లక్ష వరకు ఖర్చు చేసి మిర్చి సాగు చేశారు. అయితే వర్షాలు కురవకపోవడంతో బావుల్లో ఉన్న నీరు ఇంకిపోయాయి. విద్యుత్ మోటార్ల కింద సాగుచేసిన రైతులకు 9 గంటలు ఇవ్వాల్సిన త్రీ పేస్ కరెంటు రాకపోవడంతో పొలాలకు నీరు అందక సాగు చేసిన మిర్చి పైరు ఎండు ముఖం పట్టింది. కళ్ళముందే ఎండిపోతున్న మిర్చి పైరును ఎలా కాపాడుకోవాలంటూ రైతులు లబోదిబో అంటున్నారు. గత ఏడాది మిర్చి పంట సాగుదారులకు మంచి లాభాలు రావడంతో ఈ యాడాది ఖరీఫ్‌లో వర్షాలు రాకపోతాయా అన్న ఆశతో రైతులు మిర్చి సాగు చేశారు. మిర్చి పంటను బతికించుకోవడానికి వాటర్ ట్యాంకుతో నీరు అందించాలంటే ఎకరాకు రూ.40వేలకు పైగా అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. కనీసం విద్యుత్ మోటార్ల ద్వారానైనా 9గంటలు విద్యుత్తును ఇచ్చి తమ మిర్చి పంటను కాపాడాలని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.










