ప్రజాశక్తి - కాజులూరు
సాగునీరు లేక ఎండిపోతున్న పంట పొలాలకు తక్షణ సాగు నీరిచ్చి పొలాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జి.మామిడాడ, తరలంపూడి, పెనుమళ్ల, అయితపూడి, అండ్రంగి, చింతలంక గ్రామాలను ఆయన ఆదివారం సందర్శించారు. అక్కడ రైతులను సాగునీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో సుమారు వెయ్యి ఎకరాలు పైబడి పొలాలు సాగునీరు లేక ఎండిపోతున్నాయన్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. మండలంలో అన్ని పంచాయతీల్లో ఈ సాగునీరు సమస్య ఉందని వెంటనే ప్రజాప్రతినిధులు కూడా కలగజేసుకోవాలని కోరారు. ఆక్వా చెరువులకు సాగునీటిని మళ్లించడం తగదనానరు. ప్రస్తుతం రైతులు ఇప్పటికే రూ.15వేల వరకూ పెట్టుబడులు పెట్టారన్నారు. ఎక్కువ శాతం కౌలు రైతులు మండలంలో ఉన్నారన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతే ఎకరాకు రూ.20వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్.గోవిందు, పెనుమల్ల మాజీ సర్పంచ్ వనం వీరబ్రహ్మం, వాసంశెట్టి సత్యనారాయణ, మేడిశెట్టి సుబ్బారావు, కౌలు రైతులు పాల్గొన్నారు.










