
ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు ఖరీఫ్ ఎంతో ఆశాజనకంగా ఉండి ఆర్థికంగా తమకు ఎంతో ఊరటనిస్తుందనుకున్న రైతన్నలకు గత నెలరోజులుగా వర్షాల్లేక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే బరువెక్కిన గుండెలతో రోధిస్తూ ఏమాత్రమైన ప్రకృతికరుణించదా అన్న ఆశతో వాన చినుకుల కోసం ఆకాశంవైపు ఎంతగా ఆశగా చూసే పరిస్ధితి జిల్లా అంతటా నెలకొంది.
ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : పార్వతీపురం, సీతానగరం, గరుగుబిల్లి మండలాలకు సాగునీరందించాల్సిన జంఝావతి లోలెవెల్ కాలువ పరిధిలో సంబంధిత అధికారులు నిర్వహణ పనులు చేయకపోవడంతో ఎక్కడికక్కడ గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు మొలిచిపోవడంతో సుమారు 9వేల ఎకరాలకు సాగునీరందని పరిస్థితి ఏర్పడింది. అరకొరగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ సీతానగరం, పార్వతీపురం రైతులు ఎక్కడికక్కడ ఇసుక బస్తాలు వేసి నీటిని తమ ప్రాంతాలకు మళ్లించడంతో శివారు ప్రాంతాలైన అడ్డాపుశిల, సీతారాంపురం, కొంకడివరం, ఉల్లిభధ్ర, దళాయివలస, ఉద్దవోలు, తులసిరామినాయుడువలస, గొల్లవలస, గొట్టివలస, పెద్దూరు, గరుగుబిల్లి గ్రామాలకు చుక్కనీరు అందక రైతులు విలవిలలాడుతున్నారు. పార్వతీపురం మండలంలో దాదాపు 18వేల ఎకరాల వ్యవసాయ భూములకు గాను ఈ ఏడాది 15వేల ఎకరాల్లోనే వరిసాగు చేస్తున్నారు. అందులో సుమారు 2వేల ఎకరాలు ఎద పద్ధతిలో పండించగా, దాదాపు 4వేల ఎకరాలు వ్యవసాయాఅధారిత భూములు, మిగతా 9వేల ఎకరాలు చెరువుల కిందే సాగవుతుంది. జంఝావతి ఎగువకాలువ ద్వారా నీరందించగలిగితే సుమారు కొమరాడ, పార్వతీపురం, సీతానగరం మండలాలకు చెందిన 26వేల ఎకరాలకు సాగునీరు అందిఉండేది. పాలకుల నిర్లక్ష్యం వల్ల కాలువలు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ అందులో నీరు ప్రవహించని పరిస్థితి ఏర్పడింది. తోటపల్లి ప్రాజెక్టు జిల్లాలోనే ఉన్నప్పటికీ దానివల్ల కేవలం రెండేరెండు మండలాలకు ప్రయోజనం కలుగుతుంది. అది కూడా డిస్ట్రిబ్యూటర్ చానల్స్ ఏర్పాటు చేయకపోవడంతో చెంతన ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపయోగపడని దుస్ధితి. ఈ ఏడాది పార్వతీపురం నియోజకవర్గంలో ఎద పండించిన రైతులు ఇప్పటికే వరి పంటపై ఆశలు వదులుకున్నారు. ఇక వర్షాధార రైతులు చినుకు కోసం ఆకాశంవైపు చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలోని రైతుల పరిస్థితిపై అధికారులు అధ్యయనం చేసి ఉన్న కాస్త జలవనరులు సక్రమంగా పంట పొలాలకు అందేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుకుంటున్నారు.
సాగునీటి కోసం రైతులు ఎదురు చూపులు
పాలకొండ : సాగునీరు కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో పలు గ్రామాల్లో సాగునీరు అందకపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ ఎడమ కాలువ ద్వారా నీరు విడిచి పెటినప్పట్టికీ శివారు ప్రాంతాలకు నీరందడం లేదు. 7,8 బ్రాంచ్‌ల కింద 15వేల ఎకరాలు సాగువుతున్నప్పకీ పదివేల ఎకరాలకు సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వరి పొట్టదశలో పూర్తిగా నాశనవుతుంది. పలు గ్రామాల్లో రైతులు చెరువులో ఇంజిన్లు పెట్టి వ్యవసాయం చేసే పరిస్థితి నెలకొంది.
ఆశలు వదులుకున్నాం
ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగానైనా పడి ఆశలు రేకిత్తంచడంతో ఎదపంటను విస్తారంగా జల్లుకున్నాం. ఆ తరువాత వానలు కురవక, ఎండలు విపరీతంగా మండి పోవడంతో పైరు పూర్తిగా ఎండి పోయింది. నాకున్న ఐదెకరాల్లో ఎదజల్లుకోవడ వల్ల ఫలసాయంపై పూర్తిగా ఆశ వదులుకున్నాను.
గండి జోగినాయుడు,
రైతు, చినబొండపల్లి
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఈ ఏడాది అనావృష్టితో వరి పంట పూర్తిగా పాడైపోయిన పరిస్థితి దాపు రిం చింది. వ్యవసాయ ఖర్చులు తడిపిమోపు డైనప్పటికీ వాతావరణం ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో పంటపై ఆశలు వదులుకున్నాం. మరో రెండురోజుల్లో వర్షాలు కురవకపోతే మండలంలో దాదాపు రైతులందరి పరిస్థితి గల్లంతే. అధికారులు స్పందించి ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపట్టాలి.
గుంట్రెడ్డి సతీష్‌కుమార్,
వ్యవసాయదారుడు, పుట్టూరు