
ప్రజాశక్తి-హనుమాన్‌జంక్షన్: వరిపంటకు సాగు నీరందక ఎండిపోతోందని కాకులపాడు, కానుమోలు, దంటగుంట్ల తదితర గ్రామాల రైతులు ఆదివారం రాత్రి పెరికీడు వద్ద ఏలూరు కాలువపైగల కాకులపాడు ఛానల్ వద్ద అందోళనకు దిగారు. కాకులపాడు ఛానల్ పరిధిలో 8గ్రామాల్లో 9వేల ఎకరాలకు పైగా వరిపంట పొట్టదశలో ఉందని వారబందీ విధానంలో ఇప్పుడు కాలువ కట్టివేస్తే పంట ఎందుకూ పనికిరాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అదే సమయంలో కాలువ కట్టివేసేందుకు వచ్చిన ఇరిగేషన్న్‌మాస్తా అక్రమ్, అక్కడే ఎమ్మెల్యే వంశీ సహకారంతో ఏర్పాటు చేసిన 10 స్పీడ్ మోటార్లకు వెలుతున్న కరెంటుఫీజులు తీసివేయడంతో వాగ్వివాదం చెలరేగింది. రైతుల ద్వారా సమాచార మందుకున్న కాకులపాడు సర్పంచ్ కాజ ప్రసాద్, నక్కా గాందీ, అరిగెల రాజా ఘటనాస్థలానికి వచ్చారు. వరిపంట ఎండిపోతోందని కాలువలో నీరు మోటార్లు ద్వారా అందిస్తుంటే ఫీజులు పీకడమేమిటంటూ ప్రశ్నించ డంతో కొంతసేపు గట్టిగా వాగ్వివాదం చెలరేగింది. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే తాను పనిచేస్తానని చెప్పి అక్రమ్ ఛానల్గేటుకు లాకు వేసి అక్కడినుండి వెళ్లి పోయాడు. దీనిపై ఆగ్రహించిన రైతులు డీఈ ఇక్కడికి వస్తేనే అందోళన విరమిస్తామని లేదా గేట్లు బద్దలు కొట్టయినా నీరుమళ్లిస్తామ నడంతో ఎస్సై జనార్థన్ అడ్డుపడి ఇరిగేషన్ అధికారులకు ఫోన్లో సరిస్థితిని వివరించారు. రాత్రి 8:45గంటలకు ఘటనా 23 స్థలానికి వచ్చిన డీఈ కొడాలి బాబు రైతులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కాకులపాడు ఛానల్ కింద ఉన్న ఆయుకట్టుఅంతా మెరక పొలాలని, మీరందించే నీరు పొలాలకు కూడా చేరడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పంటలకు నీరు శాయశక్తులా కషి చేస్తున్నామని డీఈ తెలిపారు. ఆయుకట్టుకు నీరందించే బాధ్యత నాది అని డీఈ కొడాలి బాబు హామీ ఇచ్చినా రైతులు సంతప్తి చెందక ఎప్పుడో ఇవ్వడం కాదని, మీ సమక్షంలోనే ఇప్పుడే ఛానల్ గేటుకు 2 అడుగుల మేర ఎత్తాలని డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితి అర్థం చేసుకున్నానని కాకులపాడు చానల్ గేటు ఎత్తమని ఏఈ శ్రీనివాసరావుకు డీఈ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సై ఏడీఎల్ జనార్ధన్ పర్యవేక్షణలో ఏఈ శ్రీనివాసరావు లాకు తీసుకువచ్చి ఛానల్ గేటును ఎత్త డంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో దంటగుంట్ల, రంగయ్య ప్పారావుపేట, కానుమోలు కాకులపాడు, తదితర 8 గ్రామాల రైతులు పాల్గొన్నారు.