
కాకుమాను: మండల పరిధిలోని కాకుమాను బస్టాండ్ సెంటర్లో బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు కలిసి పొలాలకు సాగునీరు ఇవ్వాలని పైరు పాడైపోతుందని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి బి. రామాంజనేయులు మాట్లాడుతూ కేసులకు భయపడి నీటిని కూడా కేంద్రాన్ని అడగలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కృష్ణ,సాగర్ జలాల్లో మన హక్కులను సాధించలేక తెలంగాణ ప్రభుత్వానికి మన నీటిని వదిలేసిన అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. దీనివలనే రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కనీసం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సాగునీరు కూడా సకాలంలో అందించలేక పోతోం దని అన్నారు. మండలంలో నీటి కోసం ధర్నా జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ధర్నా జరుగు తున్న స్థలం వద్దకు తహశీల్దార్, ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. కొమ్మూరు కెనాల్‌కు నీటిని విడుదల చేసి చిట్టచివరి ఆయకట్టు వరకు నీటిని అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నాను విరమించారు. ధర్నాలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఎన్ అగస్టీన్, రాష్ట్ర తెలుగు రైతు మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వర రావు ,సంఘం డైరీ మాజీ చైర్మన్ కొల్లా వీరయ్య చౌదరి, రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.