
ప్రజాశక్తి - రేపల్లె : పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోందని ఎంఎల్‌ఎ అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్ధితి నెలకొందని అన్నారు. రైతులకు సాగునీరు ఇచ్చి ప్రభుత్వం తక్షణం ఆదుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ప్రకటించారు. కనీసం సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం దేనికని ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల నిర్వహరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. సాగునీటి కాలువల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి రైతులు బలవుతున్నారని అన్నారు. సకాలంలో కాలువల పూడిక, తూటుకాడ తీయలేదన్నారు. కాలువల మరమ్మత్తులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో చివరి ఆయకట్టుకు నీరందటం లేదని అన్నారు. కట్టలు బలహీన పడటంతో కొద్దిపాటి నీటిని విడుదల చేసినా కట్టలు తెగిపోతున్నాయని అన్నారు. రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని అన్నారు. దీంతో వేల ఎకరాల ఆయకట్టు పరిస్ధితి ప్రశ్నార్దంగా మారిందని అన్నారు. తమ ప్రభుత్వ కాలంలో పట్టిసీమ నీరు అందజేశామని అన్నారు. ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. నిజాపట్నం, రేపల్లె, నగరం మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. పొట్ట దశలో ఉన్న పంటకు నీరు అత్యంత అవసరమన్న కనీస సృహ కూడా ప్రభుత్వానికి లేకపోవటం సిగ్గుచేటని అన్నారు. కళ్ల ముందే పంట ఎండిపోవటంతో రైతులు కన్నీరు పెడుతున్నారని అన్నారు. మరో వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడంలేదన్నారు. అన్నదాతల్ని ఆదుకోలేని ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? కౌలు రైతుల పరిస్ధితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతుల నోటికి చేతికి దూరం పెరిగిపోయిందని అన్నారు. జగన్ ప్రభుత్వం రైతు వెన్నెముకను విరగ్గొట్టిందని అన్నారు. రైతుల్ని కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని అన్నారు. కృష్టా జలాలు విడుదల చేసి డెల్టా ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని కోరారు. రైతులు కోసం తాను ఏ త్యాగానికైనా సిద్దమేనని అన్నారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడనని ప్రకటించారు. ఎంఎల్‌ఎ పదవి ప్రజలు పెట్టిన బిక్ష అని అన్నారు. వారి కంటే తనకు ఏ పదవి ఎక్కువ కాదని అన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే నాగలినే శిలువగా మోస్తూ పోరాటానికి శ్రీకారం చుట్టి తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.