సాగునీరిచ్చే వరకూ దీక్ష
- సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు
ప్రజాశక్తి - నందికొట్కూరు
జూపాడు బంగ్లా మండలంలోని మండ్లం, తంగడంచ, భాస్కరాపురం గ్రామాల పరిధిలోని 5 వేల ఎకరాల మెట్ట భూములకు లిఫ్ట్ ద్వారా సాగునీరు అందించే వరకు జల దీక్ష విరమించబోమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి ఫకీర్ సాహెబ, సిఐటియు పట్టణ కార్యదర్శి టి.గోపాలకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో జరుగుతున్న జలదీక్ష ఆదివారం 26వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షను సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు ప్రారంభించి మాట్లాడారు. రైతులు చేస్తున్న జల దీక్షకు సంఘీభావం ప్రకటించడంతోపాటు వారు చేసే ఆందోళనకు ప్రత్యక్ష పోరాటాలు చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీరు పేరుతో హంద్రీనీవా, రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పాలకులు నందికొట్కూరు ప్రాంత రైతులకు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం కోల్పోయి మెట్ట ప్రాంతాలలో నివాస గృహాలు ఏర్పాటు చేసుకున్న పేద, బడుగు, బలహీన వర్గాల రైతుల భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న పోరాటాలకు సిపిఎం, ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.సురేష్, శివప్రసాద్, శ్రీనివాసులు, నాగరత్నం, ఈశ్వరయ్య, దాసు, విజయుడు, రైతులు పాల్గొన్నారు.










