Mar 16,2023 00:07

పట్టాలు చూపుతున్న గిరిజనులు

ప్రజాశక్తి-రోలుగుంట:అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎంకె.పట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 139లోని పదెకరాల భూమిలో చటర్జీపురంకు చెందిన గదబ ఆదివాసీలకు చెందిన నాలుగు కుటుంబాలు తరతరాలుగా సాగులో ఉన్నాయి. కేదారి రాజుబాబు అనే కుటుంబం కూడా అదే భూమిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. గిరిజనులు మెట్ట పంటలను పండిస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. గతంలో వీరిచ్చిన వినతిపత్రాలపై స్పందించిన రోలుగుంట రెవెన్యూ అధికారులు వారి సాగు అనుభవాన్ని తనిఖీ చేసి సాగుబడి రిజిస్టర్‌లో వారి వారి పేర్లను కూడా నమోదు చేశారు. వారికి సాగు బడి రిజిస్టర్‌ సర్టిఫికేట్‌ కాఫీలు కూడా ఇచ్చారు. అయితే తమ సాగులో ఉన్న భూమిని కాకినాడ జిల్లా బిక్కవోలు మండలానికి చెందిన ఒక వ్యక్తి పేరుతో మార్చే యబోతున్నారని తెలుసుకొని ఆదివాసీలు స్థానిక అధికారులకు గతంలోనే విజ్ఞప్తి చేశారు. నర్సీపట్నం న్యాయస్ధానంలో కూడా ఆ గిరిజనేతరుడిపై దావా వేసుకున్నారు. తాము దాఖలు చేసిన కేసు వివరాలను రోలుగుంట రెవెన్యూ అధికారులకు కూడా అందజేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని బాధితులు ఈ విధంగా తెలియజేస్తున్నారు.
సాగులో ఉన్న వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, తమ వాదనలూ వినకుండా రికార్డుల్లో మార్పు చేయడం చట్టపరంగా చెల్లదు. కానీ గత ఏడాది నవంబర్‌లో తహశీల్దార్‌ కె.వెంకటేశ్వరరావు ఆయా రికార్డులు మార్పు చేయడంతో పాటు సాగుబడి రిజిస్టర్‌లో అప్పటికే నమోదైన తమ పేర్లను తొలగించేశారని బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా నీలాపు నూకాలమ్మ మాట్లాడుతూ తమకు ఈ భూమి తప్పా వేరే జీవనాధారం లేదని, భూమిని, వ్యవసాయాన్ని నమ్ముకొని తాతల నుంచి నుండి ఇక్కడే జీవిస్తున్నామని, అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని గగ్గోలు పెట్టింది. ఇంకో రైతు నీలాపు అప్పలనాయుడు మాట్లాడుతూ, తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు తమ విజ్ఞప్తులపై స్పందించి భూముల్ని పరిశీలించారని, అయినప్పటికీ అవతలి వర్గం ఇచ్చిన లంచాలకు కుక్కర్తి పడి తమ పేర్లను తొలగించారని ఆరోపించారు.
ఈ విషయమై అఖిలభారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం మండల కన్వీనర్‌ మోసూరి రాజు మాట్లాడుతూ నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసీలకు అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత చాలా అన్యాయం జరుగుతోందని వాపోయారు. చీడికాడ నుంచి నాతవరం ప్రాంతంలోని మండలాల్లో ఆదివాసీల సాగులో ఉన్న భూముల్ని ఏకపక్షంగా రికార్డులు మార్చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై జిల్లా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించడం లేదన్నారు. ఆ సంఘం జాతీయ ప్రతినిధి పిఎస్‌.అజరుకుమార్‌ మాట్లాడుతూ చటర్జీపురం ఆదివాసీలకు జరిగిన అన్యాయంపై తాము గతంలోనే నర్సీపట్నం ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చామన్నారు. తొలగించిన ఆదివాసీ సాగుదారుల పేర్లను రికార్డుల్లో పునరుద్దరించాలని కోరామని, అయినప్పటికీ చర్యలు మాత్రం శూన్యమన్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పరిధిలోని రోలుగుంట మండలం ఉందని, గొలుగొండ మండలంలో అప్రతిష్టపాలైన తహశీల్దార్‌ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే స్వయంగా రోలుగుంట మండలానికి రప్పించారని ఆరోపించారు. ఆదివాసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉంటుందని కనీసం ఆర్డీవో స్థానిక అధికారుల సమక్షంలో సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ నెల 18న రోలుగుంట తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమానికి అక్కడి వారు సంఘీభావం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.