ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలో పేదలు సాగు చేసుకున్న ప్రభుత్వ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్ డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేదలకు భూమి పంచాలని అసైన్‌మెంట్ కమిటీని పునరుద్ధరించి రెగ్యులర్‌గా సమావేశాలు జరపాలని తెలిపారు. మంగళవారం వ్యకాస జిల్లా కమిటీ పిలుపు మేరకు దేవనకొండలో వ్యకాస మండల అధ్యక్షులు పల్లెదొడ్డి నాగేష్ అధ్యక్షతన తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యకాస జిల్లా అధ్యక్షులు వీరశేఖర్, మండల ఉపాధ్యక్షులు యూసుఫ్ బాషా, సిఐటియు మండల కార్యదర్శి అశోక్ మాట్లాడారు. మండలంలో చాలామంది పేదలు ప్రభుత్వ భూముల్లో, తమ పొలాల పక్కన భూములను సాగు చేసుకుంటున్నారని తెలిపారు. వారందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే చాలామంది తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్నా పట్టాలివ్వడంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. ఆ రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో భూమిలేని నిరుపేదలను గుర్తించి ప్రతి కుటుంబానికీ రెండెకరాల భూమి పంచాలని కోరారు. గతంలో అసైన్‌మెంట్ కమిటీ ఉండేదని, అసైన్‌మెంట్ కమిటీ ద్వారా భూములను సాగు చేసుకుంటున్న పేదలను గుర్తించి పట్టాలిచ్చే వారని తెలిపారు. అసైన్‌మెంట్ కమిటిని ఎత్తివేయడం, కేవలం అధికారులతోనే సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడంలో విఫలమవుతున్నారని చెప్పారు. గతంలో ఉన్న మాదిరిగా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో అసైన్‌మెంట్ కమిటీనీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు పల్లె దొడ్డి తిమ్మప్ప, మహేంద్ర, మహేష్, రాయుడు, నరసప్ప, వీరన్న పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందిస్తున్న నాయకులు










