Aug 18,2023 22:01

మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌

* జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
సాగులో ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించడం ద్వారా వ్యయాన్ని తగ్గించుకునేందుకు వీలుంటుందని, అందువల్ల రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి, ధాన్యం కొనుగోళ్ల కమిటీ సమావేశాలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఇప్పటికే మొదలైందని, వ్యవసాయ పనుల్లో నిమగమవుతున్న రైతులు యంత్ర పరికరాలను వినియోగించుకోవాలన్నారు. ఖరీఫ్‌ పంటలకు అవసరమైన నీటిని నీటిపారుదలశాఖ అధికారులు విడుదల చేయాలన్నారు. విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ధాన్యం సేకరణలో సంబంధిత అధికారులందరూ భాగస్వాములు కావాలన్నారు. గతంలో జరిగిన లోపాలను సమీక్షించుకుని ఈసారి మరింత మెరుగ్గా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈసారి 9.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పంట చేతికొస్తే వాటిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు అవసరమైన గోనెసంచులు, రవాణా, హమాలీలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఎక్విప్‌మెంట్‌ తదితర అంశాలపై దృష్టిసారించినట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ శిమ్మ నేతాజీ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు తక్కువ నీటితో వరి పంటను పండించేలా పైలట్‌ ప్రాజెక్టుగా ఎడబ్ల్యుడిని తీసుకొచ్చినట్లు చెప్పారు. నీటి వాడకాన్ని తగ్గించే రైతులకు సంస్థ ద్వారా పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1.62 లక్షల హెక్టార్లలో వరి పంటను వేయడమైందని, 9.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండే అవకాశం ఉందని అంచనా వేశామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, డిసిసిబి చైర్మన్‌ కె.రాజేశ్వరరావు, డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, ఎల్‌డిఎం ఎం.సూర్యకిరణ్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి ఆర్‌.వి ప్రసాదరావు, మత్స్య, పశుసంవర్థకశాఖల సంయుక్త సంచాలకులు పి.వి శ్రీనివాసరావు, ఎం.కిషోర్‌ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.