Aug 06,2023 23:10

సాగుకు సానుకూలం

* జూలైలో సాధారణానికి మించి 73 శాతం వర్షం
* అధిక వర్షపాతం కేటగిరీలో 17 మండలాలు
* ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం
* జిల్లాలో 47 శాతం మేర పంటల సాగు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌తో పోలిస్తే ఈనెలలో అన్నదాతలకు కొంత ఊరట లభించింది. జూలైలో సాధాణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లా కరువు బారి నుంచి పూర్తిగా తొలగకున్నా, పంటల సాగు కాస్త పర్వాలేదనిపిస్తోంది. సాగుకు కొంత సానుకూలత కనిపిస్తోంది. అడపాదడపా వర్షాలు పడుతుండడంతో సాగు శాతం పెరిగింది. జూలైలో కురిసిన వర్షాలతో జిల్లాలో ప్రస్తుతం లోటు వర్షపాతం కేటగిరీలో ఉన్న మండలాల సంఖ్య గణనీయంగా తగ్గింది. పలు మండలాల్లో అధిక వర్షపాతమూ నమోదైంది. పంటల సాగు నెల రోజుల కిందటి పరిస్థితితో పోలిస్తే పంటల సాగు పరిస్థితి కూడా కొంత మెరుగుపడింది.
వర్షాభావ పరిస్థితుల నుంచి జిల్లా రైతాంగం క్రమేణా గట్టెక్కుతోంది. నెల రోజుల కిందట పరిస్థితులతో పోలిస్తే సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్నిరకాల పంటలు కలిపి 4,37,165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా 2,05,758 ఎకరాల్లో (47 శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు 1,80,458 ఎకరాల్లో (45 శాతం) సాగైంది. మొక్కజొన్న పంట సాగు కాస్త బాగుంది. ఈ ఏడాది 26,375 ఎకరాల విస్తీర్ణం వేయాలని అనుకోగా, 16,163 ఎకరాల్లో (82 శాతం) వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల మేర వేస్తారని అంచనా వేయగా 1085 ఎకరాలు (24 శాతం) మేర వేశారు. పత్తి పంటను 4,620 ఎకరాల్లో వేయాలనుకోగా 2,210 (48 శాతం) మేర వేశారు. కందులు 335 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇప్పటివరకు 73 ఎకరాలు (21 శాతం) మేర సాగవుతోంది. వేరుశనగ 1333 ఎకరాల మేర సాగు లక్ష్యం కాగా, ప్రస్తుతం 190 ఎకరాల్లో (14 శాతం) వేశారు.
జూలైలో 73 శాతం అదనపు వర్షపాతం
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా, ఈనెలలో సాగుకు కొంత సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌లో సగటున 134.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 69.6 మి.మీ మాత్రమే నమోదైంది. వర్షపాతం లోటు 48.4 శాతంగా ఉంది. జూలైలో సాధారణ వర్షపాతం 184.4 మి.మీ ఉండగా 319.8 మి.మీ వర్షం కురిసింది. అదనంగా 73.4 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దీంతో జిల్లాలో 17 మండలాలు అధిక వర్షపాతం కేటగిరీలో చేరాయి. ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఆరు మండలాల్లో ఇంకా వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూలై ప్రారంభంలో తీవ్ర వర్షపాతం లోటులో ఉన్న సోంపేట మండలం కొంతమేర వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కింది. మొత్తం మీద చూస్తే అదనంగా వర్షం కురిసింది. సాధారణంగా ఖరీఫ్‌ సీజన్‌లో ఈ కాలానికి 342.8 మి.మీ వర్షపాతం నమోదవుతుండగా, ఇప్పటివరకు 400.7 మి.మీ వర్షపాతం నమోదైంది. 16.9 మి.మీ అదనంగా వర్షం పడింది.
నెల రోజుల కిందట పరిస్థితి ఇలా...
ఖరీఫ్‌ సీజన్‌లో సరిగ్గా నెల రోజుల కిందట అన్నిరకాల పంటలు కలిపి ఒక్క శాతం మాత్రమే అయ్యాయి. జిల్లాలో అన్నిరకాల పంటలు కలిపి 4,37,153 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 4,590 ఎకరాల్లో (ఒక శాతం) మాత్రమే రైతులు వేయగలిగారు. ఇందులో వరి 3,98,750 ఎకరాలకు గానూ 1975 ఎకరాల్లో సాగైంది. వర్షాభావ పరిస్థితులతో సజ్జలు, రాగులు, కందులు, పెసలు, మినుములు, నువ్వులు, చెరుకు, పత్తి విత్తనాలను ఒక్కచోట కూడా వేయలేకపోయారు. మొక్కజొన్న పంటను 26,375 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా 2,512.5 ఎకరాలో (పది శాతం) మాత్రమే వేశారు. వేరుశనగ పంటను 1333 ఎకరాల్లో వేయాల్సి ఉండగా 98 ఎకరాలు (ఏడు శాతం), గోగు పంటను 258 ఎకరాలకు గానూ ఐదెకరాల్లో (రెండు శాతం) మాత్రమే వేయగలిగారు.
వంశధార కాలువలకు పుష్కలంగా నీరు
ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని రిజర్వాయర్లు, బ్యారేజీల్లో నీటిమట్టం నిల్వలు బాగా పెరిగాయి. హిరమండలం మండలం గొట్టాబ్యారేజీ పూర్తి సామర్థ్యం 0.66 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 0.65 టిఎంసిల నీరు ఉంది. దీంతో కుడి, ఎడమ కాలువలకు పుష్కలంగా నీటిని విడిచిపెడుతున్నారు. కుడి కాలువకు 1900 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 700 క్యూసెక్కుల వరకు వదులుతున్నారు.