Jul 24,2023 00:26

మాట్లాడుతున్న గోవిందరావు

ప్రజాశక్తి -కొత్తకోట:ఉర్లోవ రెవెన్యూ పరిధిలో దళిత, గిరిజనుల డి పట్టా భూములకు ప్రధానమంత్రి కిసాన్‌ నిధి వర్తింప చేయాలని, వెబ్‌ ల్యాండ్‌, అడంగల్‌ లో నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యలు కె గోవిందరావు డిమాండ్‌ చేశారు. ఆదివారం రావికమతం మండలం కొమరి గ్రామంలో ఉర్లోలోవ రెవిన్యూ పరిధిలో సాగు దారుల సమావేశం సోలం లక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా గోవిందరావు మాట్లాడుతూ, ఉర్లోవ రెవెన్యూ పరిధి వి.మాడుగుల మండల పరిధిలో ఉండగా కొమరి, బుడ్డి బంద మచ్చ పురం గ్రామాల్లో 300 ఎకరాలు 368 మంది సాగుదారులుగా ప్రభుత్వం 2013లో పట్టాలిచ్చిందన్నారు. పట్టా ఇచ్చిన భూములకు ప్రభుత్వం పథకాలు అందలేదన్నారు. వెబ్‌ ల్యాండ్‌ రికార్డులో అడంగల్‌ 13లో నమోదు కావడంతో పంట నష్ట పరిహారాలు, బ్యాంకు రుణాలు రాలేదన్నారు. జగనన్న భూ సర్వేలో నమోదు చేయలేదన్నారు. దీని ఫలితంగా ఇచ్చిన పట్టాలకు విలువ లేకుండా పోయిందని పేర్కొన్నారు. తక్షణమే వెబ్‌ ల్యాండ్‌ రికార్డులో సాగుదారులుగా నమోదు చేయాలని, ప్రధానమంత్రి కిసాన్‌ నిధి వర్తింప జేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మాడుగులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన సిద్ధం కావాలని ఈ సమావేశంలో తీర్మానించారు.ఈ సమావేశంలో సోలం రాజు,. బురుగని రత్నం, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.