Sep 15,2023 22:02

భూమి కొలతలు పట్టుకుంటున్న సాగుదారులు

ప్రజాశక్తి రొద్దం : మండలంలోని కోగిర , కంబాలపల్లి , శ్యాపురం గ్రామాలకు చెందిన భూమిలేని దళిత, బలహీన వర్గాలకు చెందిన సాగుదారులకు పట్టాలివ్వాల్సిందేనని వ్యవసాయ కార్మికసంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. కొగిర రెవెన్యూ పొలానికి చెందిన ప్రభుత్వ భూమినిదాదాపు 200 మంది పేదలు 30 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సాగుదారులకు అధికారులు పట్టాలివ్వాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అందులో భాగంగా వ్యకాసం, సిపిఎం నాయకులు మూడురోజులుగా సాగుదారులకు ఒక్కొక్కరికి 3ఎకరాలు చొప్పున భూమిని పంపిణి చేపడుతున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు అనేకసార్లు భూ పంపిణీ చేసిన వీరి పట్ల రాజకీయ వివక్ష ప్రదర్శిస్తున్నారన్నారు. దీంతో ఈ భూమి అసైన్మెంట్‌ కు నోచుకోలేదన్నారు. పేదసాగుదారులకు ఈ భూమి తప్ప వేరే ఆధారం లేదన్నారు. ప్రతి సంవత్సరం సాగుదారులు అరుకులు , వేరు శనగ , జొన్న పంటలు సాగుచేస్తున్నారన్నారు. ఆరుగాలం కుటుంబ సభ్యులు కష్టపడి ప్రభుత్వ బీడుభూమిని సారవంతమైన సాగు భూములుగా తీర్చి దిద్దారన్నారు. గతంలో అధికారులు కూడా కొంత భూమిని అసైన్మెంట్‌ చేసి పట్టాలు ఇచ్చి మిగిలిన భూమి కూడా అసైన్మెంట్‌ చేయడానికి అవకాశం ఉందని ఉన్నతాధికారులకు 2011 సంవత్సరంలో నివేదిక ఇచ్చారన్నారు. అప్పటి నుండి సాగు దారులు మండల అధికారులకు , జిల్లా అధికారులకు అనేక వినతులు సమర్పించినా ఫలితం కన్పించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భూ పంపిణీ చేస్తామని షెడ్యులు ప్రకటించిన స్థానిక అధికారులు మరోమారు అసైన్మెంట్‌ చేయకుండా మోసం చేయడానికి పూనుకున్నారని విమర్శించారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఓ స్వచ్చంద సంస్థ కల్పవల్లి పేరుతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేసుకొని కోట్లాది రూపాయలు గడించాలని చూస్తోందని విమర్శించారు. దీన్ని నిలువరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు సాగు చేస్తే మాత్రం నిబంధనల పేరుతో పోలీసుల ద్వారా అరెస్ట్‌లు చేయడానికి పూనుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మిక సంఘం పేదలకు అండగా నిలబడి కుటుంబానికి 3 ఎకరాలు చొప్పున భూమి పంచి హద్దులు ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. అధికారులు పేదల కష్టాన్ని పరిగణలోకి తీసుకుని రికార్డుల మేరకు వాస్తవాలను గుర్తించి ప్రస్తుత భూ పంపిణీలో అసైన్మెంట్‌ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు సాగుదారులకు అందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అవసరమైతే ఈ భూ పోరాటాన్ని జిల్లా స్థాయి భూ పోరాటంగా మారుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న , జిల్లా కమిటీ సభ్యులు నారాయణ , భూ పోరాట కమిటీ నాయకులు అనిత , రామాంజనమ్మ , నాగార్జున, పద్మ మారుతి లతో పాటు 200 మంది సాగుదారులు తదితరులు పాల్గొన్నారు.