
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఎన్.నర్సాపురం గ్రామంలో పేదల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, సిపిఎం మండల కార్యదర్శి రాజేష్‌లు డిమాండ్ చేశారు. శనివారం సాగు దారులతో కలిసి భూములను పరిశీలించారు. పేదలు తమ సమస్యని నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, గ్రామంలో సర్వే నెంబర్ 41లో 20 మంది పేదలు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని గత 35 సంవత్సరాల నుండి జీడి మామిడి తోటలు వేసుకుని వచ్చిన ఫలసాయంతో కుటుంబాలను పోషించించుకుంటున్నారన్నారు. సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని సాగుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా నేటి వరకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో ప్రభుత్వం నుండి రైతు భరోసా, పిఎం కిసాన్ వంటి సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పేద రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంకె వెంకన్న, ఖండిపల్లి చిన సత్యనారాయణ, గట్టెం సత్తిబాబు, గట్టెం లోవరాజు తదితరులు పాల్గొన్నారు.