Aug 10,2023 21:56

ప్రజాశక్తి - టి.నరసాపురం
       మండలంలోని కృష్ణాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న ఎఎస్‌ఆర్‌నగర్‌ వాసులు సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్‌ 86లో సాగుభూమికి పట్టాలివ్వాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్దార్‌ జెవి.సుబ్బారావుకు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ సభ్యులు అనుమోలు మురళీ మాట్లాడుతూ కృష్ణాపురంమెట్టలో 2010 నుంచి ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి, మైనార్టీలకు చెందిన పేదలు సర్వే నెంబరు 86లో మినుములు, కందులు, పత్తి వంటి పోడుసాగు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అసైన్మెంట్‌ సవరణ ఆర్డినెన్స్‌ సాగులో ఉన్న పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఎఎస్‌ఆర్‌ నగర్‌కు మౌలిక వసతులు, విద్యుత్‌, తాగునీరు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కుమారి, బరగడ కుమారి, బూదెమ్మ ఉన్నారు.