Aug 16,2023 21:50

సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

సాగుభూములకు పట్టాలివ్వాలి : సిపిఎం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పొంగూరు గ్రామ దళిత రైతులు తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడుతూ గ్రామ సర్వే నెంబర్లు 1159, 1260, 1268, 1275, 1356, 1359, 1360, 1358 నెంబర్లలో దళిత రైతులు సాగు చేసుకుంటున్న భూములను గ్రామానికి చెందిన కొందరు పెత్తందారులు ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని లేకుంటే ఇక్కడ నుండి కదలమని ఎండను సైతం లెక్కచేయకుండా తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో భైఠాయించామని తెలిపారు.
2000 సంవత్సరం నుండి సాగులో ఉన్న భూములను కొందరు తహశీల్దార్‌ కార్యాలయంలో పరపతిని ఉపయోగించి కంప్యూటర్‌ అడంగల్‌లో పేర్లు నమోదు చేయించుకున్నారన్నారు. ప్రభుత్వం విడతల్లో ఇవ్వకుండా ఎలా అడంగల్‌లో నమోదయ్యాయని ప్రశ్నిస్తున్నామన్నారు. అలాగే అనేక విడతల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చినప్పటికీ పలుమార్లు పట్టాలు ఇవ్వాలని దళిత రైతులు అర్జీలు పెట్టుకున్నప్పటికీ అక్కడ ఉన్న పెత్తందారుల ఒత్తిడులకు లోబడి దళిత రైతులకు పట్టాలు ఇవ్వకుండా అన్యాయం జరిగిందన్నారు. 2003 నుండి బాధిత రైతులు పొలాలు సాగు చేసుకుంటున్నప్పటికీ బాధిత రైతులకు కాకుండా పెత్తందారులకు పట్టాలు ఇచ్చారన్నారు. దళితుల భూములను సాగు చేసుకుంటున్న అగ్రవర్ణాల భూముల పట్టాలను రద్దుచేసి న్యాయం చేయాలని ఆయన కోరారు. సోమశిల హైలెవెల్‌ కెనాల్‌ రావడంతో అక్కడి భూములకు విలువలు పెరగడంతో పెత్తందారులు భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. మండలంలో అనేకమంది పేదలు సాగు చేసుకుంటున్న భూములకు తహశీల్దార్‌ కార్యాలయంలో ఎకరాకు రూ.15వేలు తీసుకుని వారి పేర్లు రికార్డులలో రాస్తున్నారని తెలిపారు. దొంగ పట్టాలను వెంటనే రద్దుచేసి బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌ రెడ్డి సమక్షంలోనే అక్రమ భూ దందాను స్థానిక తహశీల్దార్‌ ఒప్పుకున్నారని తెలిపారు. బాధిత రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. దాంతో ధర్నా చేస్తున్న రైతులతో తహశీల్దార్‌ ఆనంద్‌రావు మాట్లాడి సంబంధిత భూములను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి రహంతుల్లా, సిఐటియు మండల కార్యదర్శి రత్నయ్య, ఐద్వా మండల కార్యదర్శి శ్యామలమ్మ, పొంగూరు దళిత గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అల్లంపాడు గ్రామ రెవెన్యూలో సుమారు 15మంది దళిత రైతులు సాగు చేసుకుంటున్న 40ఎకరాల ప్రభుత్వ సాగుభూమిని అగ్రవర్ణాల వారు దుక్కి చేసి ఇబ్బందులకు పెడుతున్నారని తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.