Aug 26,2023 21:44

టవర్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న గిరిజన సంఘం నాయకులు, గ్రామస్తులు

ప్రజాశక్తి - కురుపాం : గిరిజన రైతులు సాగు చేస్తున్న భూమిలో బిఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌టవర్‌ ఏర్పాటు చేయవద్దని గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు కోరారు. శనివారం మండలంలో మూలుగూడ జంక్షన్‌ వద్ద దురబిలి గిరిజనులు సాగు చేస్తున్న భూమి వద్ద చేపడుతున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ నిర్మాణాన్ని సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు 50 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిలో బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అదే భూమిని నమ్ముకొని జీవనాధారంగా బతుకు తున్న గిరిజనుల పొట్ట కొట్టవద్దని కోరారు. సాగు భూమిలో కాకుండా వేరే స్థలంలో టవర్‌ ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూల్‌ ఏరియాలో ఏదైనా నిర్మాణం చేయాలంటే పీసా చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదం కావాలని, సాగులో ఉన్న రైతులు అంగీకరించాలని, కానీ తీర్మానాలు, ఆమో దాలు లేకుండా సెల్‌టవర్‌ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోరంగి సీతారాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగునాయుడు, పువ్వుల పత్తి , తదితరులు పాల్గొన్నారు.