Nov 10,2021 06:52

ఈ మధ్యనే రుణగ్రస్తులైన రైతు కుటుంబాల విషయంలో, సగటు రుణం విషయంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నట్లు నేషనల్‌ శాంపిల్‌ సర్వే తెలిపింది. రైతు రోజువారీ ఆదాయం రూ.277 అని కూడా పేర్కొంది. ఈ సర్వేలు చేసింది 2018 లోనని ప్రస్తుత వైసిపి రాజకీయంగా తప్పించుకోవచ్చు. కానీ రైతుల ఆత్మహత్యలు, సాగు యోగ్యమైన లక్షల ఎకరాలు బీడు బారడం, ఎరువుల వినియోగం తగ్గుదల, అప్పుల ఊబి లోకి అన్నదాతలు కూరుకుపోవడం, వారికి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం రాష్ట్రంలో సాగు సంక్షోభానికి సంకేతం. ఇది జాతికి ప్రమాదం. రైతుల ఆదాయాలు రెట్టింపు చేశామని కేంద్రంలోని బిజెపి సర్కారు పలికినా, వ్యవసాయాన్ని రైతులకు పండగ చేశామని రాష్ట్ర వైసిపి ప్రభుత్వం పేర్కొన్నా వంచనే.

   కప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఆహార ధాన్యాలు పండించే అన్నపూర్ణగా ప్రఖ్యాతి గాంచగా, కొన్నేళ్ల నుండి పంటలు పండించే అన్నదాతల ఆత్మహత్యలకు నెలవు కావడం ఎంతైనా ఆందోళనకరం. మొన్ననే జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌.సి.ఆర్‌.బి) 'ప్రమాద మరణాలు- ఆత్మహత్యలు- 2020' వార్షిక నివేదిక వెలువరించగా రైతు ఆత్మహత్యల్లో ఎ.పి దేశంలోనే మూడవ స్థానం సంపాదించింది. దేశ వ్యాప్తంగా నిరుడు 10,677 మంది రైతులు, వ్యవసాయ కూలీలు బలవన్మరణం చెందగా మన రాష్ట్రంలో 889 మంది ప్రాణాలు తీసుకున్నారు. దేశంలో జరిగిన రైతు, వ్యవసాయ కార్మికుల మరణాల్లో ఎ.పి వాటా 8.32 శాతం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం రెండవ స్థానంలో వుంది. దేశ వ్యాప్తంగా గతేడాది 639 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా రాష్ట్రంలో 140 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశంలో నమోదైన కౌలు రైతుల బలవన్మరణాల్లో మన రాష్ట్రం వాటా 21.90 శాతం. వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం 2019లో మూడవ స్థానంలో ఉండగా 2020 లోనూ అదే మూడవ స్థానంలో కొనసాగింది. మన కంటే పైన 4,006 ఆత్మహత్యలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో, 2,016 ఆత్మహత్యలతో కర్నాటక రెండవ స్థానంలో ఉన్నాయి. ఎన్‌.సి.ఆర్‌.బి ప్రకారమే 2019లో 628 రైతు ఆత్మహత్యలు జరగ్గా 2020లో 889కి పెరిగాయి. ఒక సంవత్సరంలో 261 పెరిగాయి. దాదాపు 41 శాతం 'వృద్ధి' చెందాయి. ఆ మాటకొస్తే నవ్యాంధ్ర ఏర్పడ్డాక టిడిపి హయాం ఐదేళ్లల్లో ఎన్‌.సి.ఆర్‌.బి గణాంకాల ప్రకారం 2015లో అత్యధిక ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఆ సంవత్సరం 516 రైతు ఆత్మహత్యలు జరిగాయి. అనంతరం వైసిపి వచ్చాక గడచిన రెండేళ్లలో అంతకన్నా గరిష్ట రైతు ఆత్మహత్యలు సంభవించాయి.
 

                                             ఆకాశం నుండి ఊడి పడలేదు

రైతు ఆత్మహత్యల్లో ఎన్‌.సి.ఆర్‌.బి లెక్కలు తప్పని, వాస్తవానికి 2020లో 225 బలవన్మరణాలే జరిగాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సెలవిచ్చారు. సేద్యం సాగించలేక రైతు ఒక్కరు చనిపోయినా జాతి యావత్‌ సిగ్గు పడాలి, బాధ పడాలి. కానీ వ్యవసాయ శాఖామాత్యులు అలా కాకుండా టిడిపి ప్రభుత్వంలో అన్ని, తమ పాలనలో ఇన్ని అని ఇక్కడా రాజకీయం చేయజూడటం అభ్యంతరకరం. అమాత్యుల వాదన దగ్గరకే వద్దాం. ఢిల్లీలో ఉన్న ఎన్‌.సి.ఆర్‌.బి కి దివ్య దృష్టి ఏమీ లేదు. జిల్లా స్థాయిలో గల డిస్ట్రిక్టు క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో నుండి రాష్ట్ర స్థాయిలోని స్టేట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోకు ఆత్మహత్యల వివరాలు వెళతాయి. అక్కడి నుండి ఎన్‌.సి.ఆర్‌.బి కి పంపుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పంపించే వివరాలనే ఎన్‌.సి.ఆర్‌.బి వార్షిక నివేదిక రూపంలో వెల్లడిస్తుంది. కావున ఈ విషయంలో ఎన్‌.సి.ఆర్‌.బి ని తప్పుబట్టడం అసమంజసం. ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వను పొమ్మంది ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి. వై.ఎస్‌.ఆర్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రూ.లక్షన్నర ఇచ్చారు. నవ్యాంధ్రలో చంద్రబాబు సర్కారు రూ.ఐదు లక్షలకు పెంచింది. ఇప్పుడు వై.సి.పి రూ.ఏడు లక్షలు చేసింది. ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ప్రభుత్వాలు అనేక షరతులు విధించాయి. ఆ షరతుల పరిధి లోకి రాని ఆత్మహత్యలను అసలు ఆత్మహత్యలుగా పరిగణించట్లేదు. అందుకే క్రైమ్‌ రికార్డ్స్‌కు, ప్రభుత్వం పరిహారానికి గుర్తించిన అంకెలకు భారీ తేడా వస్తోంది. ప్రభుత్వ నిబంధనల్లో సాంకేతికంగా ఫిట్‌ కాని ఆత్మహత్యలను అసలు ఆత్మహత్యలే కాదనడం అమానవీయం.
 

                                                     కఠిన ఆంక్షలు

గత టిడిపి ప్రభుత్వం రైతు ఆత్మహత్యల గుర్తింపునకు అదనంగా పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకొని క్రాస్‌ చెక్‌ చేసుకొనే దారుణానికి ఒడిగట్టింది. వైసిపి సర్కారు తన రూ.ఏడు లక్షల పరిహారానికి పలు నియంత్రణలు పెట్టింది. హెల్త్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారుల త్రిసభ్య కమిటీ నిర్ధారణ రిపోర్టు, పోస్టుమార్టం, ఆధార్‌, ఇ-క్రాప్‌, బ్యాంక్‌ అకౌంట్‌, వెబ్‌ల్యాండ్‌లో పేరు, కౌలు రైతు అయితే సి.సి.ఆర్‌.సి తప్పనిసరిగా ఉండాలి. ఏది లేకపోయినా నిజమైన ఆత్మహత్య కాదు. రాష్ట్రంలో 32 లక్షల కౌలు రైతులుంటే, సి.సి.ఆర్‌.సి లు ఒక్కో ఏడాదిలో పట్టుమని మూడు లక్షల మందికి కూడా ఇవ్వకుండా, కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నా అది ఆత్మహత్య కాదనడం ఏం న్యాయం? ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెట్టి, వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా నిరాకరించడం ఎలా సబబు? రైతు ఆత్మహత్యల గుర్తింపుపై ఇన్ని అవాంతరాలు పెట్టుకొని పారదర్శకంగా ఉన్నామని, దాచేసే ఉద్దేశం ఉంటే ఇన్ని ఆత్మహత్యలు కనిపించేవే కాదనడం తప్పుదారి పట్టించడానికే. ఏ రోజు దినపత్రికలు తిరగేసినా ఏదో ఒక మూలన రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ఎన్‌.సి.ఆర్‌.బి నివేదిక వచ్చిన రోజునే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో 36 ఏళ్ల కౌలు రైతు లక్ష్మీనారాయణ అప్పుల బాధ తాళలేక కలుపు మందు తాగి పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీసు, యావత్‌ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన చోటనే సదరు ఆత్మహత్య జరిగింది. ఇది అధికారిక ఆత్మహత్య అవుతుందో లేదో తెలీదు. ఇలాంటివి నిరుడు రాష్ట్రంలో ప్రతి రోజూ రెండు, మూడు సంభవించాయని ఎన్‌.సి.ఆర్‌.బి పేర్కొంది.
 

                                                         జాతికి ప్రమాదం

కరువు వలన రైతులు సాగు నిలిపివేశారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ సాగు నీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సైతం రైతులు సాగు పట్ల అనాసక్తి చూపించడం ఈ ఖరీఫ్‌ లోనే కనిపించింది. నెల్లూరు జిల్లాలో కండలేరు జలాశయంలో సమృద్ధిగా నీరు ఉండి ఖరీఫ్‌ సాగుకు విడుదల చేస్తామని అధికార యంత్రాంగం టముకు వేసినా రైతులు ముందుకు రాలేదు. వ్యవసాయం చేసి పంటలు పండించినా గిట్టుబాటు ధరలు రావట్లేదన్న నిస్పృహతోనే రైతులు లక్షల ఎకరాల్లో సేద్యానికి దూరమయ్యారు. ఉచిత విద్యుత్‌ ఇచ్చినా భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నా సాగు పట్ల వెనుకంజ వేస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి సాగు కావాల్సిన సాధారణ విస్తీర్ణంలో పది లక్షల ఎకరాలు సాగు కాలేదు. అక్టోబర్‌ రెండో వారానికి ఎలాగోలా సాగు తగ్గుదలను ఐదు లక్షల ఎకరాలకు ప్రభుత్వం తీసుకొచ్చింది. సాధారణంగా ఖరీఫ్‌ జూన్‌తో మొదలై సెప్టెంబర్‌తో ముగుస్తుంది. ఎక్కడో ఆలస్యంగా వరి వేసే చోటనే అక్టోబర్‌లో నాట్లు వేస్తారు. విచిత్రంగా అక్టోబర్‌ రెండో వారానికల్లా ఐదు లక్షల ఎకరాలు అదనంగా సాగైందని వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చేందుకు అంకెలను తిరగరాసి సాగును గణాంకాల్లో చూపింది. సాగు తగ్గుదల, కరోనా ప్రభావం, ఆర్థిక సంక్షోభాన్ని తెలుసుకోడానికి పెద్దగా సర్వేలు చేయనవసరం లేదు. ఖరీఫ్‌లో నిరుటి కంటే ఎరువుల వినియోగంలో క్షీణతే ఒక కొలబద్ద. దాదాపు రెండున్నర లక్షల టన్నుల ఎరువుల వినియోగం తగ్గింది. గతేడాది కంటే 14 శాతం తక్కువ. డిఎపి, ఎంఒపి ఎరువులకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడగా వాటి వినియోగం సైతం తగ్గింది. యూరియా, ఎన్‌పికె ఎరువుల అమ్మకాలూ తగ్గాయి. రైతులు ఒక బస్తా వేసే చోట అర బస్తా వేశారు. అదనుకు కావాల్సిన ఎరువు దొరక్కపోవడం ఒక కారణమైతే, చేతిలో డబ్బుల్లేక పోవడం మరో కారణం. ఈ మధ్యనే రుణగ్రస్తులైన రైతు కుటుంబాల విషయంలో, సగటు రుణం విషయంలో మన రాష్ట్రం దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నట్లు నేషనల్‌ శాంపిల్‌ సర్వే తెలిపింది. రైతు రోజువారీ ఆదాయం రూ.277 అని కూడా పేర్కొంది. ఈ సర్వేలు చేసింది 2018 లోనని ప్రస్తుత వైసిపి రాజకీయంగా తప్పించుకోవచ్చు. కానీ రైతుల ఆత్మహత్యలు, సాగు యోగ్యమైన లక్షల ఎకరాలు బీడు బారడం, ఎరువుల వినియోగం తగ్గుదల, అప్పుల ఊబిలోకి అన్నదాతలు కూరుకుపోవడం, వారికి వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం రాష్ట్రంలో సాగు సంక్షోభానికి సంకేతం. ఇది జాతికి ప్రమాదం. రైతుల ఆదాయాలు రెట్టింపు చేశామని కేంద్రంలోని బిజెపి సర్కారు పలికినా, వ్యవసాయాన్ని రైతులకు పండగ చేశామని రాష్ట్ర వైసిపి ప్రభుత్వం పేర్కొన్నా వంచనే.
 

/ వ్యాసకర్త సెల్‌ : 9490099019 /

కె.ఎస్‌.వి. ప్రసాద్‌