Jun 21,2023 00:51

ప్రజాశక్తి-తెనాలి : ఖరీఫ్‌ సాగుకు సమయం ఆసన్నమైనా పంట కాల్వల పూడిక తీతలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి అన్నారు. మండలంలోని పెదరావూరు, జగ్గడిగుంటపాలెం గ్రామాల్లో పంట కాల్వలను స్థానిక రైతులతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబిరెడ్డి మాట్లాడుతూ కాల్వల్లో గుర్రపుడెక్క, తూటికాడ పేరుకు పోయిందన్నారు. సాగునీటి విడుదలకు సమయం ఆసన్నమైనా కాల్వల పూడిక తీయకపోవటం సరికాదన్నారు. కొల్లిపర మండలం పిడపర్రు లాకులు పూర్తిగా దెబ్బతిన్నాయని, అధికారులు పరిశీలించటం మినహా వాటి మరమ్మతులు చేపట్టలేదని విమర్శించారు. భూమి శిస్తు వసూలులోనూ సైటు ఓపెన్‌ కావటంలేదంటూ ఆరునెలలు జాప్యం చేశారని, జాప్యం ప్రభావం రైతుల పడితే ఉపేక్షించేది లేదన్నారు. పరిశీలనలో ఎ.వెంకటేశ్వర్లు, టి.మాధవరావు ఉన్నారు.
వరి గడ్డి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని ఏపి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని జగ్గడిగుంటపాలెంలో సోమవారం వాటిల్లిన అగ్ని ప్రమాదలంలో కుర్రా శివరామకృష్ణప్రసాద్‌కు చెందిన 13 ఎకరాలు, కుర్రా సీతారామయ్యకు చెందిన 12 ఎకరాల గడ్డివామి దగ్ధమయ్యాయి. బాధిత రైతులను సాంబిరెడ్డి మంగళవారం పరామర్శించి, ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. విద్యుత్‌ లైన్ల నుంచి వచ్చిన నిప్పురవ్వల కారణంగా వరిగడ్డి దగ్ధమైందని, వారికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.