Oct 30,2023 22:55

ప్రజాశక్తి - జగ్గంపేట రూరల్‌ మెట్ట ప్రాంతంగా పిలవబడే జగ్గంపేట మండలంలోని రైతులు సాగు నీరందక కష్టాలు పాలవుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో ఒకో ఎకరానికి సుమారు 30- 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి వేశారు. కానీ సాగు నీరందక వరి పొలాలు అన్ని ఎండిపోయి బీటలు వారుతున్నాయి. మండలంలోని జె.కొత్తూరు, మన్యంవారి పాలెం, తదితర గ్రామాల్లో నీరు లేక చేతికందే పంట ఎండిప్తోంది.
తోట వెంకట చలం పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గంపేట మండలానికి సాగు నీరు అందడంతో మెట్ట భూములు కాస్తా వరి సాగు భూములయ్యాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోని మెట్ట రైతులు వరిని సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాదీలాగానే ఈ ఏడాదీ జగ్గంపేట మండలంలో 8,737 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఏలేరు ఆయకట్టు భూములు పుష్కలంగా ఉంటే, పుష్కర ఆయకట్టు భూములు మాత్రం ఎండిపోతున్నాయి. పుష్కర నీరైనా వస్తుంది, వర్షాలైనా కురుస్తాయి అని జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలకు వరి నాట్లు వేశారు. నాట్లు ఎదిగాయి. గింజ పొదిగే దశ వరకూ చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీటితో రక్షించుకోగలిగారు. కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా ఉండటంతో చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందించే పుష్కర పైపు లైన్లు తాళ్లూరు వద్ద రిపేరుకు రావడంతో మండలంలోని రాజపూడి, జె.కొత్తూరు, మన్యంవారిపాలెం, గోవింద పురం, కాండ్రేగుల, గొల్లలగుంట, గుర్రంపాలెం గ్రామాల్లోని వరి పంటలు బీటలు వారుతున్నాయి. ఎకరాకు రూ.30 నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెట్టామని, సాగునీరఅందక తమ పొలాలు పూర్తిగా నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుణుడైనా కరుణిస్తాడని చూస్తున్నామని, వర్షాలు కురిసినా, పుష్కర అందించినా తమ పొలాలు కొద్దిమేరకైనా దక్కుతాయని రైతులు పేర్కొంటున్నారు. పుష్కర అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.