Oct 14,2023 00:22

- కాలువగట్లపై జంగిల్‌ క్లియర్‌ చేయలేని జగన్‌ ప్రభుత్వం
- గుండ్లకమ్మ గేట్లు పెట్టకపోవడంలో కుట్రకోణం
- వైసిపి నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా
- రైతులు,పేదలపట్ల జగన్‌కు చిత్తశుద్ది ఏది?


ప్రజాశక్తి - అద్దంకి : ఖరీఫ్ సీజన్ వచ్చి రోజులు గడుస్తుండటంతో పొలాలు దున్ని వర్షం కోసం ఆకాశం వైపు చూసే పరిస్థితి ఏర్పడిందని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. కొన్ని చోట్ల బోర్లు కింద పంట సాగు చేశారని, ఈదశలో నీరు అందకపోతే పంట ఎండిపోయే ప్రమాదం ఉందని, నీటి సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని పంగులూరు, బల్లికురవ మండలాల రైతులు ఎంఎల్‌ఎ దృష్టికి తెచ్చారు. ఈసందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ ఖరీఫ్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులను ఆదుకోవాలని, వ్యవసాయానికి సరిపడా సాగర్ జలాలు విడుదల చేయాలని కోరారు. మాగాణి భూములకు సాగునీటిని అందించాలని అన్నారు. సాగర్ నీటి విడుదల గురించి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని కోరారు. నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలో జిల్లాలో సుమారుగా 4,42,344ఎకరాల ఆయకట్టు ఉండగా అందులో 1,85,486ఎకరాలు మాగాణి భూములు ఉన్నాయని అన్నారు. అద్దంకి బ్రాంచ్ కెనాల్ 18/0 క్రింద సుమారు 72.252ఎకరాలు, దర్శి బ్రాంచ్ కెనాల్, ఒంగోలు బ్రాంచ్ కెనాల్ క్రింద సుమారు 1,13,234ఎకరాల మాగాణి భూములు ఉన్నట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు రైతులు నారుమళ్ళు పొసుకొని, నీళ్ళు వస్తాయో, లేదో అనే అయోమయ పరిస్థితిలో ఉన్నారని అన్నారు. కాలువల్లో నాచు తొలగించాలని కోరారు. లేకుంటే నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని అన్నారు. నాలుగేళ్ల నుండి కాలువ గట్లపై జంగిల్ క్లియరెన్స్ చేయలేదన్నారు. గట్లు ప్రమాదకరంగా తయారయ్యాయని అన్నారు. గుండ్లకమ్మ జలాశయ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి 16నెలలు కావస్తున్నా నేటికీ అమర్చకపోవడం వైసిపి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. గేట్లు కొట్టుకుపోయి నీరు వృధాగా పోతుందని టిడిపి ఆందోళనలు చేస్తే ప్రాజెక్టులు సందర్శించిన జలవనరుల శాఖ మంత్రి నెల రోజులలోపే గేట్లు ఏర్పాటు చేస్తామని గొప్పలు చెప్పారని ఎద్దేవా చేశారు. రైతుల కోసం పేదల కోసం అంటూ పదేపదే టీవీల ముందు మాట్లాడే సిఎం గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో సన్న చిన్న కారు రైతులు దాదాపు లక్ష ఎకరాలకుపైగా సాగు, రెండువేల మందిపైగా మత్స్యకార కుటుంబాలు జీవనం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.  ఇసుక మాఫియా కోసమే గేట్లు పెట్టలేదని ఆరోపించారు. ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరిలో ప్రాజెక్టును పరిశీలన చేపడితే ఆఘమేఘాలపై 2గేట్లు అమర్చి 3వ గేటు పెట్టకపోవడం వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా గేట్లు అమర్చకపోవడంతో తమ్మవరం, మణికేశ్వరం, అనమనమూరు, మోదేపల్లి నదీ పరీవాహక ప్రాంతంలో వైసిపి నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతుందని అన్నారు. తమ్మవరం రేవు వద్ద డ్రెజ్జర్లతో రాత్రి పగలు తేడాలేకుండా టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని అన్నారు. రైతులు, పేదల పట్ల ఈ సిఎంకు చిత్తశుద్ధి లేదని అన్నారు. 
ప్రజాశక్తి- సంతమాగులూరు
టిడిపికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని మక్కెనవారిపాలెం అంకమ్మ గుడి నుండి పరిటాలవారిపాలెం ఎన్టీఆర్ విగ్రహం వరకు 10కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. వైసిపి కక్షపూరిత రాజకీయాలు పరాకాష్టకు చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్య పర్చడమే లక్ష్యంగా సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేకపోయినప్పటికీ తప్పుడు కేసులతో అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన, భవిష్యత్తు గ్యారెంటీ సభలకు పోటెత్తుతున్న జన సంద్రాన్ని చూసి జగన్‌రెడ్డి ఓటమి భయంతో అరెస్టులకు తెరతీశారని అన్నారు. గతంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటిస్తే ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో అలాంటి పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళుతుందని అన్నారు. అధికారానికి వస్తే రూ.3వేలు పెన్షన్‌ ఇస్తానని నమ్మించి అధికారానికి వచ్చిన తర్వాత కేవలం రూ.250పెంచుకుంటూ మడమ తిప్పేశాడని అన్నారు. ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాడని అన్నారు. నాలుగేళ్లు దాటినా డీఎస్సీ ఉసేత్తటం లేదన్నారు. జగన్‌ విధానాలతో అనేక పరిశ్రమలు రాష్ట్రం నుండి వెళ్లిపోయాయని అన్నారు. వేలాది మంది యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని అన్నారు. నిరుద్యోగులకు టిడిపి ప్రభుత్వంలో రూ.2వేలు నిరుద్యోగ బృతి ఇస్తే వైసిపి రద్దు చేసిందన్నారు. టిడిపి అధికారానికి వస్తే 20లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. యువగళం నిధితో నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు భృతి ఇస్తామన్నారు. వైసిపికి బుద్దిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ ర్యాలీలో మహిళలు రవికుమార్‌కు హారతులు ఇచ్చారు. కొమ్మాలపాడులో ముస్లిం యువత మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ర్యాలీ ముందువరుసలో రవికుమార్ సైకిల్ తొక్కాడు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తేలప్రోలు రమేష్, ధూపాటి ఏసోబు, మాజీ ఎంపిపి సన్నేబోయిన ఏడుకొండలు, గొట్టిపాటి చౌదరి బాబు, కొనికి గోవిందమ్మ, ఏలూరి శ్రీనివాసరావు, నాగభోతు సుజాత, మోతాదు భాష, పసుపులేటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.