
రాయచోటి : ఖరీఫ్‌లో వింత ధోరణి ఏర్పడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో భూములు ఖాళీగా ఉన్నాయి. ఆగస్టు చివరి వారమైనా ఒకవైపు చాలాచోట్ల సేద్యం లేక భూములు బీళ్లుగా ఉన్నాయి. ప్రభుత్వం మరోవైపు సెప్టెంబర్ లోపల అధికారిక రికార్డులలో పంట సాగు ఇ-క్రాప్ బుకింగ్ నమోదు చేస్తు న్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 82,589 హెక్టార్లు. ఇప్పటి వరకు 25,210 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. రైతుల విత్తనాలు తీసుకున్నప్పటి నుంచి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం పొలంలో దుక్కి చేసుకో వడానికి కూడా వర్షాలు కురవడం లేదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వరి, వేరుశనగ, పత్తి, పప్పు ధాన్యాలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు పంట సేద్యంపై ఆశలు వదులుకున్నారు. సీజన్ ప్రారంభమైన్పటి నుంచి రైతులకు ఉత్సాహంగా కనిపించడం లేదు. వేసిన పంట కూడా వర్షాభావం కార ణంగా ఎండిపోతున్నాయి. పంటలు సాగు చేయకపోతే ప్రభుత్వం ఇచ్చే పెట్టు బడి సాయం, రైతు భరోసాను వెనక్కి ఇచ్చేయాలన్న భావంతో రైతులు ఏదో ఒక పంట వేసి ఇ-క్రాప్ ఇతర రికార్డులను నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వేరుశనగ గిట్టుబాటుగాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 60 శాతం పంట సాగు చేయాల్సిందిగా కానీ ప్రస్తుతం 30 శాతం వరకు రైతులు పంట సాగు చేసినట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఆర్‌బికెల ద్వారా ప్రభుత్వం విత్తనాలను అందిస్తోంది. వరి విస్తీర్ణం 9,748 హెక్టార్లు, వేరుశనగ విస్తీర్ణం 47,885 హెక్టార్లు ఉంది. ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం సికె నారాయణ రకాలు విత్తనాలు 40 శాతం సబ్సిడీతో అధికారులు రైతులకు అందజేశారు. ఖరీఫ్ వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 47,88 హెక్టార్లు, దాని కనీస మద్దతు ధర రూ.5550 కాగా గత ఏడాది రూ.6500 వరకు పలికింది. ఈ ఏడాది రూ.6,800 నుంచి రూ. 7 వేల వరకు పలుకుతుంది. జాతీయ ఆహార భద్రత పథకం కింద 750 కిట్లు వేరుశనగ, 9,000 కిట్లు కంది, 8000 కిట్లు రాగి, 150 కిట్లు కొర్ర చిరు సంచులను పంపిణీ చేశారు.
రైతులను ఆదుకోవాలి
జూన్ నుండి వర్షం కోసం ఎదురుచూస్తున్నాం. వేరుశనగ విత్తనాలను తెచ్చుకొని విత్తనాల వేయడానికి సిద్ధం చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు వర్షం కురవలేదు. వర్షం కురిస్తే పంటలు పండి తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరగవుతుంది. ప్రభుత్వం స్పందించి ర్తెతులను ఆదుకోవాలి.
- చంద్రయ్య, రైతు, ఎండపల్లి, రాయచోటి.
కరువు జిల్లాగా ప్రకటించాలి
వ్యవసాయ రంగం నేడు దేశవ్యాప్తంగా సంక్షేభంలో ఉంది. రైతు గౌరవప్రదంగా జీవించగలిగే పరిస్థితులు లేవు. పాలకుల విధానాల కారణంగా రైతులు కౌలు రైతులు గ్రామీణ చేతి వత్తుదారులు స్థితిగతులు దిగజారి పోతున్నాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.
-సి.రామచంద్ర, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి, అన్నమయ్య.
రైతులు ఆందోళన చెందొద్దు
వేరుశనగ పంట వేసిన రైతులు ఒక లీటర్‌కు రెండు గ్రాములు యూరియా కలిపి వేరుశనగ పంటకు స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల పంటను దాదాపు పది రోజుల వరకు కాపాడుకోవచ్చు. ఈ లోపల వర్షాలు జిల్లాలో కురుస్తాయి. ఇప్పటి వరకు 50 శాతం ఇ-క్రాప్ నమోదు చేశాం. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నివేదికను తయారు చేస్తున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది. కావున రైతులు ఆందోళన చెందవద్దు.
- చంద్రా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, అన్నమయ్య.వర్షాలు కురవకపోవడంతో బీళ్లుగా మారిన పొలాలు