కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్న కార్పొరేటు వ్యవసాయం జరగాలంటే రైతులు భూముల నుండి ఖాళీ చేయాలి. అది జరగాలంటే వ్యవసాయం వరుస నష్టాల్లో కూరుకుపోవాలి. కుటుంబ జీవనానికి, కనీస సదుపాయాలకు అప్పులపై ఆధారపడే పరిస్థితి పెరగాలి. రైతు సాగు చేయడం నిలిపివేయాలి. అప్పుడే వ్యవసాయ భూములు తక్కువ ధరకు లభ్యం కావడం, అత్యధిక జనాభా కూలీలుగా మారడం జరుగుతుంది. ఇందుకోసం జరుగుతున్న కుట్రలో భాగమే నేడు తగ్గుతున్న సాగు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం పది లక్షల ఎకరాల్లో తగ్గింది. ఈ లెక్క ప్రభుత్వం ప్రకటించినది. వాస్తవ సాగు మరింత తగ్గి వుంటుంది. సాధారణంగా వర్షం రాకపోతే, ప్రాజెక్టులలో నీరు లేకపోతే సాగు తగ్గుతుంది. ఈ ఖరీఫ్‌లో ఇవి ప్రధాన కారణాలు కాకపోయినా సాగు తగ్గింది. ఇది ఈ సంవత్సరానికే పరిమితమైన సమస్య కాదు. సాగు విస్తీర్ణం తగ్గడం అనేది కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ సంవత్సరం అది మరింత తీవ్రమైంది. వ్యవసాయ రంగంలో ఎందుకు ఈ పరిణామం జరుగుతోంది. ఈ పరిస్థితికి ముఖ్య కారణాలు ఏమిటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది నేడు తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. లేకపోతే వ్యవసాయం వుంటుంది, వ్యవసాయం చేసే రైతు వుండడు.
అనంతపురం జిల్లాలో వేరుశనగ ప్రధాన పంట. 2000 సంవత్సరంలో 7.92 లక్షల హెక్టార్లలో సాగు కాగా, ఈ సంవత్సరం 4.74 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అంటే గత పదకొండు సంవత్సరాల్లో 3.18 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు తగ్గింది. ఈ మేరకు కొత్త పంటల సాగు కొంత పెరిగినా నికరంగా 2.74 లక్షల హెక్టార్లలో పంట సాగు కావడంలేదు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాపితంగా వుంది. ఈ పరిణామంపై ఎ.పి. రైతుసంఘం, శోధన సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి పదిరోజుల్లో 21 మండలాల్లోని 77 గ్రామాల్లో 498 మంది రైతుల దగ్గర సర్వే జరిగింది. ఏటేటా పంట దిగుబడి తగ్గిపోవడం, పెట్టుబడి ఖర్చు భారీగా పెరగడం, గిట్టుబాటు ధర అందకపోవడం, ప్రభుత్వ సహాయం క్రమంగా తగ్గిపోవడం, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం ప్రధాన కారణాలుగా రైతులు తెలిపారు.
పెట్టుబడి ఖర్చు
2017 ఖరీఫ్‌లో 4,03,135 హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తే మొత్తం పెట్టుబడి ఖర్చు రూ.1835 కోట్లు. దిగుబడి 3,99,749 మెట్రిక్ టన్నులు. 2020 సంవత్సరంలో 4,80,595 హెక్టార్లలో సాగు చేస్తే అయిన పెట్టుబడి ఖర్చు రూ. 2,913 కోట్లు. దిగుబడి 2,18,781 మెట్రిక్ టన్నులు. గత సంవత్సరం ఒక ఎకరా వేరుశనగ పంట వేయడానికి ఎకరాకు రూ.18 వేలు ఖర్చు కాగా, ఈ సంవత్సరం రూ.24 వేల వరకు అయింది. ఇలాగే రాష్ట్రంలో ఇతర పంటల సాగు ఖర్చు పెరిగింది.
విత్తన సామర్థ్యం
గతంలో రైతులు తమ పొలంలో లేదా తన చుట్టూ వుండే గ్రామాల్లో పండిన మంచి పంట నుండి విత్తనాలను సేకరించుకునేవారు. ఈ పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా లేకుండా పోయింది. ప్రభుత్వమే కొత్త పరిశోధనలు చేస్తున్నట్లు వాటితో పంట సాగు చేస్తే అద్భుతాలు జరుగుతున్నట్లు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పరిశోధన అనంతరం వేసిన మొదటి రకం విత్తనం దిగుబడికి అదే విత్తనం మూడో పంట కాలానికి దిగుబడి సగానికి సగం తగ్గిపోతోంది. ప్రతి సంవత్సరం కొత్త విత్తనాల పరిశోధన జరగదు. పరిశోధనల మీదే ప్రభుత్వాలకు శ్రద్ధ లేదు. ఈ పరిస్థితిని బహుళజాతి కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి. తమ విత్తనాల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. రైతు కొత్త విత్తనాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడం, అధిక మొత్తంలో ఖర్చు చేసి విత్తనాలను కొనడం, దిగుబడి రాక నష్టపోవడం జరుగుతున్నది.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012లో జిల్లాలో 7.08 లక్షల హెక్టార్లు సాగు కాగా ... హెక్టారుకు 409 కిలోల దిగుబడి వచ్చింది. 2018లో 4.64 హెక్టార్లలో సాగు చేయగా దిగుబడి 200 కిలోలకు పడిపోయింది.
యాంత్రీకరణ
వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగింది. ఇందులో కొన్ని ప్రయోజనాలు వున్నాయి. అయితే అంతకంటే ఎక్కువగా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. గతంలో పశువులపై ఆధారపడి వ్యవసాయం చేసేటప్పుడు ఒకసారి పశువులు కొనడానికి ఖర్చు చేస్తే చాలా సంవత్సరాల వరకు వాటి సంతానంతో వ్యవసాయ పనులు సాగేవి. మేత, వాటి నిర్వహణ మాత్రమే వుండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా కనిపించడంలేదు. ట్రాక్టర్లు, యంత్రాలు పెరిగిపోయాయి. దుక్కి నుండి కోతల వరకు ఎకరాలు, గంటల ప్రాతిపదికగా ఖర్చు చేసే పరిస్థితి వచ్చింది. వీటికయ్యే ఖర్చు ఏ రోజుకు ఆ రోజే నగదు రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఇందుకోసం చేతిలో నగదు వుండాలి. ఇది లేని వారికి రెండు మార్గాలు మాత్రమే వున్నాయి. ఒకటి అప్పు చేయడం, రెండు సాగు చేయకుండా వదిలేయడం. అలాగే గతంలో పేద, మధ్యతరగతి రైతులు ఒకరికి ఒకరు బదులుగా పొలాల్లో పనులు చేసుకునేవారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గేవి. యంత్రాలు వచ్చిన తర్వాత ఈ అవకాశం లేకుండా పోయింది.
ఎరువులు, పురుగుమందుల ధరలు
వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఐదు సంవత్సరాల క్రితం డిఎపి 20-20-013 రకం 50 కేజీల బస్తా రూ.400-450 వుండేది. ప్రస్తుతం రూ.1200, ఎన్‌పికె 14-35-14 రకం రూ.450 నుండి రూ.1500కు, పొటాష్ రూ.300 నుండి రూ.1100 కు పెరిగింది. అలాగే పురుగు మందుల ధరలు గత ఆరు సంవత్సరాల్లో 200 శాతం పెరిగాయి. మోనోక్రోటోఫాస్ లీటర్ రూ.220 నుండి రూ.450-500కు, క్లోరిపైరిఫాస్ లీటర్ రూ.180 నుండి రూ.500 కు పెరిగింది. వీటికి తోడు బయో మందుల ధరలకు అదుపు లేదు. కంపెనీలు తమ ఇష్టం వచ్చినట్లుగా ఎంఆర్‌పి వేస్తున్నాయి. ఎంఆర్‌పి రేటుకు అమ్మడం అంటే ప్రభుత్వం నిర్ణయించిన లేదా గుర్తించిన ధర అనే భావన ప్రజల్లో వుంటుంది. ప్రోక్లైన్ అనే పురుగు మందు డబ్బా పైన రూ.550 ఎంఆర్‌పి వుంటే, రైతులకు రూ.300కే ఇస్తున్నారు. అంటే ఎంఆర్‌పి ధరకు వాస్తవంగా అమ్మే ధరకు ఇంత వ్యత్యాసం వుందని ప్రభుత్వాలకు తెలియదా? తెలిసినా ఎందుకని నియంత్రించడంలేదు?
గిట్టుబాటు ధరలు
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు అందే పరిస్థితే లేదు. ఆలస్యంగా కొనుగోలు ప్రారంభించడం, నిబంధనల పేరుతో పంటను తిరస్కరించడం, చెల్లింపులు మరింత ఆలస్యం చేయడంతో అనివార్యంగా రైతులు ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఫెర్టిలైజర్ షాపుల వారు ఎరువులు, పురుగుమందులు అప్పులు ఇచ్చి పంటను తామే కొంటున్నారు. మిర్చి, పత్తి పంటల్లో ఇది మరీ ఎక్కువగా వుంది.
ఆరు సంవత్సరాల క్రితం 42 కేజీల వేరుశనగ బస్తా ధర రూ.1970, ఇప్పుడు 45 కేజీల బస్తా రూ.1800. ప్రభుత్వాలు ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా అందడంలేదు. వేరుశనగ క్వింటాకు రూ.5,550 ప్రకటించింది. అంటే 45 కేజీలకు రూ. 2,500. కాని ఇది ఎక్కడా అమలు కావడంలేదు. ప్రైవేటు వ్యాపారులు కేవలం రూ.1800కే కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. రైతు ఏ నమ్మకంతో వ్యవసాయం చేస్తాడు? ఇది ఒక పంట పరిస్థితే కాదు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు అందడంలేదు. అందుకే ప్రతి సంవత్సరం రైతు పెట్టుబడి నష్టపోతున్నారు. ఎంత సాగు చేస్తే అంత అప్పు అనే విధంగా మారింది.
తగ్గుతున్న ప్రభుత్వ సహాయం
రైతుల గురించి ఎన్నికల్లో చెప్పిన హామీలకు అమలులో జరుగుతున్న సహాయానికి ఏమాత్రం పొంతన వుండడంలేదు. గత ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు 75 నుండి 90 శాతం సబ్సిడీతో డ్రిప్పు పరికరాలు ఇచ్చేవారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న ప్రాంతాల్లో ఈ డ్రిప్ సేద్యం సాగు విస్తీర్ణాన్ని పెంచింది. అనంతపురం జిల్లాలో 2014-15 సంవత్సరంలో 7,912 మంది రైతులు 8,548 హెక్టార్లలో బిందు సేద్యం చేస్తే 2018-19 సంవత్సరానికి 3600 మంది రైతులు, 40,000 హెక్టార్లల్లో సాగు చేసారు. 2019- 20 సంవత్సరంలో 29 వేల హెక్టార్లకు కొత్తగా అర్జీలు పెట్టుకున్న రైతులు తమ వాటాగా రూ. 9 కోట్లు ప్రభుత్వానికి చెల్లించారు. కాని వైసిపి ప్రభుత్వం 2019 నుండి ఇప్పటి వరకు బిందు సేద్యానికి ఒక్క రూపాయి విడుదల చేయలేదు. పరికరాలు ఇవ్వడంలేదు. దీంతో పాత పరికరాల స్థానంలో కొత్తవి ప్రైవేటు కంపెనీల నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేయడమో లేదా బిందు సేద్యాన్ని వదులుకోవడమో జరుగుతోంది.
వర్షం మీద ఆధారపడిన రైతుల పంట ఎప్పుడూ నష్టాల్లోనే వుంటుంది. అందుకే ప్రభుత్వాలు పంట నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చేది. 2009 నుండి 2020 వరకు జిల్లా రైతులు నష్టపోయింది రూ.28,920 కోట్లు. ప్రభుత్వాలు చెల్లించిన ఇన్‌పుట్ సబ్సిడీ కేవలం రూ. 3,013 కోట్లు. గత తెలుగుదేశం ప్రభుత్వం 2018-19 సంవత్సర పంట నష్టపరిహారం రూ.1800 కోట్లు చెల్లిస్తామని జీవో ఇచ్చి అమలు చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించడం నిలిపివేసింది. ఎకరాకు రూ. పాతిక వేలు పెట్టుబడి పెట్టి పంట మొత్తం నష్టపోతున్న రైతుకు ... 'రైతు భరోసా' పేరుతో ప్రభుత్వం ఇస్తున్న రూ.15,300ను కూడా సంవత్సరానికి నాలుగు దఫాలుగా ఇస్తున్నారు. అందుకే రైతులు సాగు తగ్గించుకుంటున్నారు. ఇన్సూరెన్స్ నిబంధనలు రైతుల కంటే ప్రైవేటు కంపెనీలకు ఉపయోగపడే విధంగా వుంటున్నాయి. కొన్ని సంవత్సరాల్లో రైతులు చెల్లించే ప్రీమియం కంటే వచ్చే ఇన్సూరెన్స్ పరిహారం తక్కువగా వుంటుంది. ఉదాహరణకు 2015లో రూ.115.06 కోట్లు రైతులు ప్రీమియం చెల్లిస్తే, రైతులకు వచ్చిన పరిహారం రూ.109.66 కోట్లు.
నీటి కుంటలు, చెక్ డ్యాంలు నిర్మించుకోవడం, చెరువుల మరమ్మతులు చేసుకొని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని చెప్పిన ప్రభుత్వాలే నేడు వాటికి నిధులు నిలిపివేసాయి. ఈ పథకాలకు గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. దీనివల్ల భూగర్భజలాలు కొద్దిమేరకైనా పెరిగాయి. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. వీటికోసం రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడంలేదు.
రైతు కుటుంబాల్లో నిరాస్తకత
పొలం బీడు పెట్టడం అగౌరవంగా రైతులు భావించేవారు. దాంతో అప్పు చేసైనా సాగు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. పైన వివరించిన కారణాల వల్ల ఏ రైతు కుటుంబంలో కూడా తమ పిల్లలు వ్యవసాయం చేయాలని కోరుకోవడంలేదు. పిల్లలు కూడా వ్యవసాయ పని కంటే పట్టణాల్లో ఏదోక వృత్తి చేసి జీవించడానికే ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ విధానాలు కూడా ఈ పద్ధతినే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్న కార్పొరేటు వ్యవసాయం జరగాలంటే రైతులు భూముల నుండి ఖాళీ చేయాలి. అది జరగాలంటే వ్యవసాయం వరుస నష్టాల్లో కూరుకుపోవాలి. కుటుంబ జీవనానికి, కనీస సదుపాయాలకు అప్పులపై ఆధారపడే పరిస్థితి పెరగాలి. రైతు సాగు చేయడం నిలిపివేయాలి. అప్పుడే వ్యవసాయ భూములు తక్కువ ధరకు లభ్యం కావడం, అత్యధిక జనాభా కూలీలుగా మారడం జరుగుతుంది. ఇందుకోసం జరుగుతున్న కుట్రలో భాగమే నేడు తగ్గుతున్న సాగు. వ్యవసాయం వుంటుంది, కాని రైతులు చేసే వ్యవసాయం కాదు, కార్పొరేట్లు చేసే వ్యవసాయం వుంటుంది. దేశం వుంటుంది కాని ఆ దేశానికి వెన్నెముక అయిన రైతు మాయమైపోతున్నాడు. రైతు వ్యతిరేక, కార్పొరేటు అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడకుండా సాగును పెంచలేం.
/ వ్యాసకర్త- సిపిఎం అనంతపురం జిల్లా కార్యదర్శి /
వి. రాంభూపాల్











