ప్రజాశక్తి -అనంతగిరి:1/70 చటం, పీసా వంటి గిరిజన హక్కులు, చట్టాలను తుంగలో తొక్కి తాత ముతాత కాలం నుండి సాగులో ఉన్న భూములు లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తే ఊరుకునేంది లేదని స్థానిక జెడ్పిటిసి దీసరి. గంగరాజు, స్థానిక ఎంపీపీ శెట్టి .నీలవేణిలు డిమాండ్ చేశారు. విజయనగరం మానస ట్రస్ట్ పివిటి రాజు, సిబ్బందిలు ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదని ఇక్కడ నుండి వెనక్కు వెళ్లిపోవాలని తెలిపారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో ప్రారంభమైన ర్యాలీ తహశీల్దార్ కార్యాలయంకు చేరింది. భూముల జోలికి వస్తే తరిమి కొడతాం.. గో బ్యాక్ విజయనగరం మనసా ట్రస్టు పివిటి రాజులు అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేసి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తహశీల్దార్ రాంభాయి ఆద్వర్యన స్దానిక వెలుగు కార్యక్రమంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో రైతులు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకంగా తీర్మానించారు. ఈ సందర్భంగా ఉద్దేశించి జెడ్పిటిసి, ఎంపీపీలు మాట్లాడుతూ, విజయనగరం జమీందారుల పరిపాలన కాలంలోని భూముల్లో సాగులో ఉన్నట్లు అప్పటినుండి ఇప్పటివరకు రెవెన్యూ రికార్డులలో నమోదు కాలేదని, 50. ఏళ్ల తర్వాత తమకు సంబంధించిన భూములు ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఇందుకు రహస్యంగా సర్వేలు నిర్వహించి భూములు లాకున్నేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కొండిభ పంచాయతీ డమ్ముకు, మూవ్వంవలస, టోకురు పంచాయతీ బి.కంభవలస, రాయివలస, అనంతగిరి పంచాయతీ అనంతగిరి, ముండిజమ్మగుడ, ఎగువశోభ పంచాయతీ కొత్తవలస, హెక్టగుడ పంచాయతీ పరిధి ఎనిమిది గ్రాముల సాగు రైతులతో గిరిజన సాంప్రదాయ ఆయుధాలతో తిరుగుబాటుకు రైతుల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని, తక్షణమే వెనక్కు వెళ్లి పోవాలని వారు హెచ్చరించారు. రాజులు హైకోర్టుకు ఆశ్రయించినప్పుడు రైతుల పక్షాన డివిజనల్ రెవెన్యూ అధికారులు ఎందుకు హైకోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయలేదని వారు ప్రశ్నించారు. గత మూడు నెలల క్రితం రహస్యంగా సర్వేలు నిర్వహిస్తుండగా నిలదీసి వెనక్కు పంపించడం జరిగిందని ఆ విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. పంచాయతీల సర్పంచులు కిల్లో మొస్య, సోమ్మెల రూతూ, పి.పున్నమ్మ, కె.సింహద్రి, ఎంపీటీసీ సారా. రత్నకుమారిలు మాట్లాడుతూ, నాలుగు పంచాయతీల పరిధిలోని 200 మంది రైతులు 318.26 ఎకరాల భూమిలో సాగులో ఉన్నారని, పూర్వకాలం నుండి సాగులో ఉంటూ వ్యవసాయ పంటలు, కాపీ, మిరియాలు వంటి అంతర్జాతీయ పంటలు పండిస్తూ జీవనధారం సాగిస్తున్నారని తెలిపారు. ఈ భూములతో సంబంధం లేని గిరిజనేతురులు వీటి జోలికి వస్తే తరిమి కొడతామన్నారు. ఇప్పటికే కొంతమంది సాగు రైతులకు జిరాయితి, డిఫారం పట్టాలు రెవిన్యూ అధికారులు మంజూరు చేశారని, మిగతా వారికి కూడా పట్టాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
తహసిల్దార్ రాంబాయి మాట్లాడుతూ విజయనగరం మనసా ట్రస్టు రాజులు 2022లో హైకోర్టులో ఆశ్రయించగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ పాడేరు పిఓ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ప్రజాప్రతినిధులు, రైతుల అభిప్రాయాలను సేకరించిన అనంతరం నివేదికను అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్. నాగులు, గిరిజన సంఘం మండల అధ్యక్షులు జె. సుబ్బారావు, మాజీ సర్పంచ్ సార దొన్ను, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, రెవెన్యూ సిబ్బంది ఆర్‌ఐ లక్ష్మీకాంత్, మల్లన్న, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరరావు, గిరిజన రైతులు పాల్గొన్నారు.










