Sep 15,2023 21:05

సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి : వ్య.కా.స

కడప అర్బన్‌ : సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్‌ అన్వేష్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16న కడప ఆర్డీవో కార్యాల యం వద్ద సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని ధర్నా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కడప ఆర్డీవో పరిధిలో ఒంటిమిట్ట, సిద్ధవటం, పెండ్లిమర్రి, ఖాజీపేట, వల్లూరు మండలాలలో ప్రభుత్వ బంజరు భూములలో సాగులో ఉన్నటువంటి పేదల భూ ములకు అసైన్మెంట్‌ కమిటీ ఏర్పాటు చేసి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒంటిమిట్ట రెవెన్యూ గ్రామం సర్వే నంబర్‌ 2050 పొలంలో పేదలు ఏడు సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారని తెలిపారు. సిద్ధవటం మండలం పెద్దపల్లి రెవెన్యూ పొలం పెద్దపల్లి దళితులు సాగులో ఉన్నారని చెప్పారు. పెండ్లిమర్రి మండలం పెద్దదాసర్పల్లె రెవెన్యూ పొలం సర్వే నంబర్‌ 330లో వెల్లటూరు, పెండ్లిమర్రి ఎస్సీ, ఎస్టీ పేదలు ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. వీరందరికీ అసైన్మెంట్‌ కమిటీ ఏర్పాటు చేసి పట్టాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వెంటనే వారందరికీ పట్టాలు మంజూరు చేయాలని కోరారు.