* జిల్లాను వెంటాడుతున్న వర్షాభావ పరిస్థితులు
* 84 శాతం మాత్రమే పంటలు వేయగలిగిన రైతులు
* వర్షపాత లోటు జాబితాలో ఎనిమిది మండలాలు
* పలాస డివిజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
సెప్టెంబరు రెండో వారంలోకి ప్రవేశిస్తున్నా జిల్లా ఖరీఫ్ సాగు అసంపూర్ణంగానే ఉంది. జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో జూలై మినహా జూన్, ఆగస్టు నెలల్లో వర్షపాతం లోటు తీవ్రంగానే ఉంది. ఈ నెల మొదటి ఐదు రోజులు గడిచినా చెప్పుకోతగ్గ వర్షాలు నమోదు కాలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం వార్తలతో పుష్కలంగా వర్షాలు పడతాయని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. వర్షాలు లేక ఒక వైపు, ఎండ వేడిమి మరో పక్క ఎక్కువగా ఉండటంతో పొలాలు నెర్రలు దేరుతున్నాయి. పంటలకు కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లుపడుతున్నారు. చెరువులు, బావుల ద్వారా మోటర్లతో నీటిని తోడి పొలాలను తడుపుతున్నారు.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో అన్ని రకాల పంటలు కలిపి 4 లక్షల 37 వేల 165 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్ధేశించుకోగా, 3,67,643 ఎకరాల్లో (84 శాతం) పంటలు వేశారు. వరి పంటను 3,98,750 ఎకరాల్లో వేస్తారని అంచనా వేయగా ఇప్పటివరకు 3,39,588 ఎకరాల్లో (85శాతం) సాగైంది. మొక్కజొన్న పంటను ఈ సంవత్సరం 26,375 ఎకరాల విస్తీర్ణం వేయాలని అనుకోగా 23593 ఎకరాల్లో (89శాతం) వేశారు. పత్తి పంటను 4620 ఎకరాల్లో వేయాలనుకోగా, 2,675 (58 శాతం) మేర వేశారు. చెరుకు పంటను 4,550 ఎకరాల మేర వేస్తారని అంచనా వేయగా, 1320 ఎకరాలు (29 శాతం) మేర వేశారు. కందులు 335 ఎకరాల్లో వేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇప్పటివరకు 93 ఎకరాలు (28 శాతం) మేర సాగవుతోంది. వేరుశనగ 1333 ఎకరాల మేర సాగు లక్ష్యం కాగా, ప్రస్తుతం 273 ఎకరాల్లో (20 శాతం) వేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 253 ఎకరాల్లో పెసలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 13 ఎకరాలు (ఐదు శాతం), మినుములు 273 ఎకరాల్లో రైతులు విత్తనాలు వేస్తారని అంచనా వేయగా, ఇప్పటివరకు పది (నాలుగు శాతం) ఎకరాల్లోనే వేయగలిగారు.
ఎనిమిది మండలాల్లో లోటు వర్షపాతం
ఖరీఫ్ మొదటి, రెండు నెలల్లో వర్షాలు పెద్దగా పడకపోయినా ఆగస్టులో కురుస్తాయని అంతా భావించారు. అయితే ఆగస్టులోనూ లోటు వర్షపాతమే కొనసాగింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 181.9 మి.మీగా ఉండగా, 128.6 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. 29.3 శాతం లోటు వర్షపాతం నమోదయింది. ఖరీఫ్ ప్రారంభం నుంచి మంగళవారం వరకు పరిశీలిస్తే స్వల్ప లోటు కనిపిస్తోంది. ఈ కాలానికి 533.8 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 532.1 మి.మీ వర్షం పడింది. వర్షపాతం లోటు 0.3 శాతంగా నమోదయింది. 13 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఎనిమిది మండలాల్లో ఇంకా వర్షపాతం లోటు కనిపిస్తోంది. తొమ్మిది మండలాల్లో అధిక వర్షం కురిసినట్లు నమోదయింది. మొత్తం మీద జూలై ప్రారంభంలో తీవ్ర వర్షపాతం లోటులో ఉన్న సోంపేట మండలం కొంత మేర వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కింది.
పలాస డివిజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
జిల్లాలో ఉన్న మూడు డివిజన్లల్లో ఖరీఫ్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు వర్షాల పరిస్థితిని పరిశీలిస్తే పలాస డివిజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. టెక్కలి, శ్రీకాకుళం డివిజన్లలో పరిస్థితులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి.
పలాస డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లో కలిపి సాధారణంగా 558.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 388.2 మి.మీ వర్షం పడింది. డివిజన్‌లో 30.5 శాతం మేర వర్షపాతం లోటు కనిపిస్తోంది. టెక్కలి డివిజన్‌లోని తొమ్మిది మండలాల్లో సాధారణ వర్షపాతం 576.9 మి.మీగా ఉండగా, మంగళవారం వరకు 662.3 మి.మీ వర్షం కురిసింది. 14.8 శాతం అదనంగా వర్షపాతం నమోదయింది. శ్రీకాకుళం డివిజన్‌లోని 13 మండలాల్లో సాధారణ వర్షపాతం 488.7 మి.మీగా, ఉండగా ఇప్పటివరకు 530.5 మి.మీ వర్షం కురిసింది. డివిజన్‌లో 8.6 శాతం అదనంగా వర్షపాతం నమోదయింది.
వర్షపాతం వివరాలు ఇలా (మి.మీ.లో)
నెల సాధారణం కురిసింది
జూన్ 134.9 69.6
జులై 184.4 319.8
ఆగస్టు 128.6 181.9










