- టైలరింగ్, జ్యూట్ సంచుల తయారీపై ఉచిత శిక్షణ
- స్వయంఉపాధికి రుణాలు అందజేత
- 84 గ్రామాలు, 5వేల మంది సభ్యులకు లబ్ధి
ప్రజాశక్తి -భీమునిపట్నం : సహకార చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక బ్యాంకు కాలనీలో
2002 లో ప్రారంభించిన సాగర వికాస సహకార పొదుపు సంఘం నేడు అటు జివిఎంసి నాలుగు వార్డులు, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల పరిధిలో సుమారు 84 గ్రామాల్లో కార్యకలాపాలు విస్తరించింది. సుమారు 500 మంది మహిళా సభ్యులతో ప్రారంభమైన సంఘం, నేడు దాదాపు వెయ్యి గ్రూపులు, 5 వేల మంది సభ్యులతో విస్తరించింది. మహిళల ఆర్థిక స్వావలంభనకు చేదోడుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
టైలరింగ్, జ్యూట్ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణ
సంఘం ప్రారంభం తొలినాళ్లలో ఆసక్తి గల, స్వయంసమద్ధి సాధించాలనే పట్టుదల ఉన్న ఎంతో మంది మహిళలకు టైలరింగ్, జ్యూట్ సంచుల తయారీలో ఉచిత శిక్షణ ఇచ్చారు. శిక్షణతో పాటు ఆర్థిక చేయూత ఇస్తూ, మహిళలు ఆర్థికంగా స్వయం సమద్ధి సాధించే దిశగా సంఘం నిర్విరామ కషి ప్రశంసనీయం. పొదుపు ప్రాధాన్యతను తెలియజేస్తూ విస్తృత ప్రచారం, అవగాహన కల్పించారు.
మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా....
మైక్రో ఫైనాన్స్ సంస్థలు, బడా వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఎక్కువ మంది సామాన్య, మధ్య తరగతి మహిళలు సంఘంలో సభ్యులుగా చేరి, ఒక్కో సభ్యురాలు నెలకు రూ.50 నుంచి రూ.500 వరకు పొదుపు చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, చేపలు తదితర వ్యాపారాలు చేసుకునేందుకు సాగర వికాస సహకార పొదుపు సంఘం సభ్య మహిళలకు రుణ సాయం అందిస్తుంది. సభ్యులే ఈ సంఘంలో డైరెక్టర్లుగా ఉండడం సంఘ పారదర్శకతకు నిదర్శనమనే చెప్పాలి.
మరో ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నా..
సంఘంలో చేరి పదేళ్లుగా పొదుపు చేస్తున్నాను. టైలరింగ్‌లో శిక్షణ తీసుకొని, సొంత కాళ్లపై నిలబడుతున్నాను. కుటుంబసభ్యులకు అండగా ఉంటున్నాను. మరో ఇద్దరు మహిళలకు ఉపాధి అందిస్తున్నా. పొదుపు చేసిన మొత్తం నుంచి రూ 10 వేలు నుంచి రూ.లక్ష వరకు సంఘం రుణం ఇస్తుంది.
మల్లేటి నూకరత్నం,
టైలర్, బ్యాంక్ కాలనీ, భీమిలి










