ప్రజాశక్తి-విశాఖపట్నం : విశాఖ సాగర తీరంలో ఈ నెల 26వ తేదీన తలపెట్టిన సాగర్ తీర స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జీవీఎంసీ కమిషనర్ జి.లక్ష్మీశతో కలిసి జిల్లా అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాగర్ తీరంలో కోస్టల్ బ్యాటరీ నుంచి భీమునిపట్నం బీచ్ వరకు సుమారు 40 ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. పార్లే ఫర్ ది ఓషన్స్ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ, జీవీఎంసీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్స్, కాలేజీ విద్యార్థులు, సందర్శకులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సుమారు 25000 మంది పాల్గొనే లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలో మొదటిసారిగా తీర ప్రాంత స్వచ్ఛతలో ఒకేసారి ఇంతమంది స్వచ్ఛందంగా పాల్గొనడం ఒక రికార్డ్ కానుందని వివరించారు. 26వ తేదీ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొనబోవు ప్రజలు అరగంట ముందుగా వారి సెంటర్‌కు చేరుకోవాలని చెప్పారు. మైనర్లు పాల్గొనరాదని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం జరిగే అన్ని ప్రాంతాలలో మంచినీరు, మజ్జిగ, మెడికల్ కిట్స్ తదితర ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ కమిషనర్‌కు సూచించారు. కార్యక్రమంలో ఎక్కడా ప్లాస్టిక్‌కు సంబంధించి ఎటువంటి వస్తువులు వినియోగించరాదని పేర్కొన్నారు.
అదే రోజు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి విశాఖ జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిపారు. బీచ్ రోడ్‌లోని ఎయు కన్వెన్షన్ సెంటర్ నందు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అమెరికా సంస్థ పార్లే ఫర్ ది ఓషన్స్ తో ఎంఒయు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్ నందు మైక్రోసాఫ్ట్ సంస్థచే శిక్షణ పూర్తి చేసుకున్న 5000 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్, డిఆర్‌ఓ శ్రీనివాస్ మూర్తి, ఆర్‌డిఒ హుస్సేన్ సాహెబ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










