జీవితపు ఆశలన్నీ పడవలో నింపుకొని
నీటిలో పడవ ప్రయాణాన్ని సాగిస్తున్న
అవతల తీరం నా కోసం వేచిచూస్తుంది
దారిలో నా వెంట నడిచేది నేనొక్కడినే
బాధలే నా బంధువులు..
కష్టాలే నా స్నేహితులు..
ఎగసిపడుతున్న అలలు నన్ను
పలకరిస్తూ పోతున్నాయి
నాకో పాఠాన్ని నేర్పుతూ
నీటి తుంపుర్లు నాపై జల్లులై కురుస్తూ..
అలలన్నీ శబ్దాలు చేస్తూ నా పడవని తాకుతున్నాయి
మీనాలు ఒక్కొక్కటిగా నన్ను చూస్తూ పోతున్నాయి
నా బాధల్ని అలా ఆరాతీస్తూ
సాగర గర్భంలోని ముత్యపు చిప్పలు..
బయటి విశాల ప్రపంచాన్ని..
తన వేలితో నాకు చూపిస్తుంది
తెల్లని చాపలా పరుచుకున్న సముద్రం..
నా చెవి దగ్గరకు చేరి
నాకో మాట చెబుతుంది..
నీ ఎదలో పారే కన్నీటి సముద్రం కంటే
నేను గొప్పేమీ కాదని
నన్ను దాటడం నీకు కష్టమేమీ కాదని
తీరపు తీపి అంచులు నన్ను ఊరిస్తున్నాయి
నా చేతిలోని తెడ్డు గమ్యం వైపు చూస్తూ..
పడవను అలా ముందుకు నెడుతోంది
ఆకాశం నా వైపే చూస్తూ..
నా ఎదలోని లయబద్ధమైన
గుండె చప్పుడును వింటుంది
పొద్దెక్కిన సూరీడు నాకు దారిని చూపుతూ
పర్వతాల చాటున ముసుగేసుకుంటున్నాడు
తీరానికి చేరువలో నా జీవితపు పడవ.
ఒడ్డున చేరగానే పుడమితల్లి
నన్ను అక్కున చేర్చుకుంది
సాగరం ఆనందంతో ఎగసిపడుతుంది.
నేను గమ్యాన్ని చేరిన సందర్భాన
విశాల ప్రపంచం ఇపుడు నా కళ్ళముందు
- అశోక్ గోనె, 94413 17361