ప్రజాశక్తి-సత్తెనపల్లి : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్ కుడి కాల్వ ఆయకట్టు పరిధిలో నారుమడులకు, ఆరుతడులకు సాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పుతుంబాక భవన్‌లో జరిగిన సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లకీëశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ వర్షాల్లేక పైర్లు దెబ్బతింటున్నాయని, మిర్చి ఇంకా నాటాల్సి ఉందని, సత్వరమే సాగర్ నీటిని విడుదల చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విద్యుత్ చట్టం తెస్తుంటే రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని, మణిపూర్‌లో ఘటనలపైనా నోరు మెదపడం లేదని, పార్లమెంటులోనూ బిజెపికి సహకరించారని విమర్శించారు. పోలవరం నిర్వాసితుల సమస్య, రాజధాని విధుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రైతులకు ఇచ్చిన రుణాలపై బ్యాంకుల్లో పావలా వడ్డీ, కానీ సున్నా వడ్డీ కానీ విడుదల చేయలేదని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య మాట్లాడుతూ సత్తెనపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు రైతులకు మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలన్నారు. సిపిఎస్ రద్దు చేస్తానన్న జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు ద్రోహం చేశారని, దీనిపై వైఖరిని చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి 50 వేల మంది ఉద్యోగులకు గాను పది వేల మందినే పర్మినెంట్ చేసి మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 28 మండలాలకు గాను నాలుగు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైందని, మిగతా ప్రాంతాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలని, బిఎల్‌ఒ డ్యూటీల నుండి మినహాయించాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు రక్షణ పరికరాలు నెలలతరబడి పెండింగ్‌లో పెట్టారని, వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.గోపాల్‌రావు, జి.రవిబాబు, నాయకులు జి.మల్లేశ్వరి, జి.బాలకృష్ణ, డి.విమల, డి.శివకుమారి, కె.హనుమంతురెడ్డి పాల్గొన్నారు.










