Mar 02,2023 22:27

ప్రజాశక్తి-నందిగామ: నందిగామ, చందర్లపాడు మండలాలకు సాగర్‌ జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. నందిగామ మండలం లింగాలపాడు, బెల్లంకొండవారిపాలెం, చెరువుకొమ్ముపాలెం, పెద్దవరం గ్రామాలలో సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న రైతులు చెరువుకొమ్ముపాలెం సాగర్‌ కాలువ వద్ద గురువారం ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ నందిగామ, చందర్లపాడు మండలాలలో సుమారు ఐదు వేల ఎకరాలలో సాగునీరు అందక మిర్చి, పసుపు, పత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేదాద్రి ఎత్తిపోతల పథకం మరమ్మతులకు నోచుకోక కునారిల్లుతుందన్నారు. గత ప్రభుత్వం మరమ్మతులకు 7 కోట్ల రూపాయలు బడ్జెట్‌ అవసరం ఉంటుందని అంచనా వేసినా అయినా నిధులు విడుదల చేయకపోవడంతో స్కీము మూలన పడిందన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం అధికారంలో వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న వేదాద్రి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకొని వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు సాగర్‌ జలాలు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు టి.సుబ్బారెడ్డి, కె.దానయ్య, జె.రామకష్ణ, పాశం పుల్లారెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి, పాశం ఉపేందరరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సయ్యద్‌ ఖాసిం, సిఐటియు నాయకులు కె.గోపాల్‌, వి.ఏసోబు, గోపినాయక్‌ పాల్గొన్నారు.