ప్రజాశక్తి-విజయవాడ రూరల్
రూరల్ గ్రామాలకు నాగార్జున సాగర్ జలాలు రావడం దయనీయంగా మారింది. రెండు దశాబ్దాలుగా సాగర్ కాల్వ నిరుపయోగంగా ఉంది. నూజివీడు బ్రాంచ్ కెనాల్ పరిధిలో మాచవరం మేజర్ కింద నున్న, కుందావారి కండ్రిక, పాతపాడు, నైనవరం, జక్కంపూడి మేజర్ కింద జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లిలో ఆయ కట్టు ఉంది. ఏటా అక్టోబరు, నవంబరులో సాగర్ కాల్వకు ఎన్‌ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేస్తారు. ఇరవై సంవత్సరాలుగా రూరల్ గ్రామాల రైతులు సాగర్ జలాల కోసం ఎదురుచూస్తున్నా నీటిని విడుదల చేయడం లేదు. పలు గ్రామాల్లో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. ఏటా డిసెంబరు, జనవరి నెలల్లో రైతులు తోటలకు నీళ్లు పెట్టుకునే వారు. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో ట్యాంకర్లతో నీటిని పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం సాగర్ కాల్వ పూర్తిగా ముళ్ల పొదలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. గత ప్రభుత్వ హయాంలో కాల్వ అభివృద్ధికి చర్యలు చేపడతామని అధికారులు చెప్పినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. పలుమార్లు రైతులు ఎన్‌ఎస్పీ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగర్ కాల్వను అభివృద్ధి చేయడంతో పాటు నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.










