Oct 16,2023 22:56

వినతిపత్రం ఇస్తున్న రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు


ప్రజాశక్తి - నందిగామ : ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం నందిగామ రెవిన్యూ డివిజనల్‌ కార్యాలయం వద్ద రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ నెల రోజులుగా తీవ్ర వర్షాభావం వల్ల నందిగామ, చందర్లపాడు తదితర మండలాల్లో సాగునీరు లేక ప్రతి, మిర్చి మాగాణి, అపరాల పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని తక్షణమే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కష్ణా నది జలాలను మన వాటాగా వాడుకోవలసిన 200 టిఎంసిల నీటిని తెలంగాణ రాష్ట్రం తరలించుకుపోయిందని, రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి వసతులు కల్పించే దాంట్లో చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. నందిగామ ప్రాంతంలో 17వేల ఎకరాల ఆయకట్టు ఉన్న వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకం నాలుగు సంవత్సరాల నుండి పనిచేయక మూలన పడిందని అన్నారు. చెరువు మాధవరం ట్యాంకు నుండి 100 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేసి వాణిజ్య పంటలు పండించే రైతన్న ఆదుకోవాలని ప్రభుత్వాధికారులను కోరారు. కంచల -ఏటూరు మేజర్‌ కాలవ పరిధిలో సుమారు 17000 ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం ఉందని ఎకరానికి రూ.50 వేల నుండి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నందిగామ రెవిన్యూ డివిజనల్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం నందిగామ ఎన్‌ఎస్పి కార్యాలయం చేరుకొని సాగర్‌ నీరు విడుదల చేయాలని నిరసన తెలిపారు. నందిగామ ఎన్‌ఎస్‌పిడిఇ సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం మరమ్మతులకు 7.3 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఒకటి రెండు రోజుల్లో టెండర్‌ ద్వారా పనులు చేపడతామని త్వరలో సాగర్‌ జలాలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు యర్రా శ్రీనివాసరావు, కర్రి వెంకటేశ్వరావు, చల్లారి బుజ్జి, ఆదినారాయణ, రామారావు, రాయుడి వెంకటేశ్వరరావు తదితల్లి పాల్గొన్నారు.