Sep 13,2023 22:55

సమావేశంలో మాట్లాడుతున్న వి.కృష్ణయ్య

ప్రజాశక్తి -గుంటూరు : సాగర్‌ ఆయకట్టును కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు జె.శివశంకర్‌ అధ్యక్షత వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ సాగర్‌ నీరు విడుదల చేయకపోవడంతో గుంటూరు జిల్లాలోని 50 శాతం సాగు భూమి అయిన ఎనిమిది మండలాల్లో పంటలు వెయ్యలేదన్నారు. ఏ పంటలు పండించాలో అయోమయంలో రైతులున్నారని, ప్రజలు తాగునీటి సమస్యనూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సాగర్‌ కాల్వ పరిధిలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, అన్ని రకాలుగా సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. ఐదేళ్ల నుండి పంటలు సరిగా పండక పోవడం, మద్దతు ధరల్లేకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు, కౌల్దార్లు అప్పుల పాలయ్యారని, వీరందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సంస్కరణ పేరుతో స్మార్ట్‌ మీటర్లు బిగింపును విరమించుకోవాలన్నారు. గృహాలకు స్మార్ట్‌ మీటర్లు పెడితే రెట్టింపు బిల్లుల వస్తున్నాయని చెప్పారు. ఎరువులు, పురుగు మందుల ధరలు పదిరెట్లు పెరిగాయని, ఆర్‌బికేల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఏవీ అందించడం లేదని విమర్శించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు కోసం భూ యజమాని సంతకం, అనుమతి ఉండాలనే నిబంధన వల్ల 90 శాతం మంది కౌల్దార్లకు కార్డులు దక్కడం లేదన్నారు. ఈ కారణంగా కౌలురైతులకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు అందడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. రెవెన్యూ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. లంక భూములు దీర్ఘకాలంగా సాగు చేస్తున్న పేద రైతులను భూముల నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతు సమస్యలపై ఈనెల 15-25 తేదీల్లో ఆర్‌బికేల్లో వినతి పత్రాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. పాడి రైతులకు ఇవ్వాల్సిన లీటరుకు రూ.4 బోనస్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌, ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి, నాయకులు కె.పూర్ణచంద్రరావు, కె.వెంకటేశ్వరరావు, వై.బ్రహ్మేశ్వరరావు, ఎం.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.భాస్కర్‌రావు, కె.స్రవంతి, సాంబశివరావు, నాగేశ్వరరావు, సుధాకర్‌రావు, ఐ.రామారావు పాల్గొన్నారు.