Jan 02,2022 16:06

అది ఆత్మీయులకు నిలయమైన అందమైన అడవి. అక్కడ అన్ని జంతువులు, సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తున్నాయి.
అడవి కూడా రాజ్యమే కదా! అడవికి సింహం రాజుగా ఉంది. అయినా మనుషులు అడవిలోకి చొరబడి, వాటి నివాసాల్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో నివారణా చర్యల్లో భాగంగా, జంతువులన్నీ ఒక్కటై సైనికదళం ఏర్పాటు చేసుకున్నాయి. మనుషుల్తో యుద్ధం చేసి తరిమేసే నైపుణ్యం సొంతం చేసుకున్నాయి. మనుషులు అడవిలోనికి రావాలంటేనే భయపడేలా తమ రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాయి. కొన్నేళ్ళ వరకు మనిషి అడవి పైన, తన పట్టు సాధించాలనే ఆలోచనకే సవాల్‌ విసిరాయి జంతువులు. దాంతో మనుషులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
కోతుల సైన్యాధికారి తన పదవిని, వారసత్వంగా తన సంతతికి ఇవ్వాలని అనుకున్నది. కానీ, మిగతా కోతులు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే 'సైన్యాధికారి కొడుకు అవిటివాడు. అలాంటివాడికి ఆ స్థానాన్ని ఎలా ఇవ్వగలం?' అంటూ మిగతా కోతులు ప్రశ్నించడం మొదలెట్టాయి. 'మన అడవికి ఏదైనా ఆపద వస్తే ఎదుర్కోగలిగిన వ్యూహం పన్నగల నేర్పరితనం ఆ కోతిలో ఉన్నాయా?' అని తిరిగి ప్రశ్నించాయి. అవిటితనంతో ఉన్నవారికి పదవిని కట్టబెట్టరు అనే విషయం సైన్యాధిపతికీ తెలుసు. కానీ అవిటితనం కంటే బుద్ధిబలం గొప్పదని నిరూపించాలి అనుకుంది సైన్యాధికారి. అందుకే చిన్నప్పటి నుంచి దాని కొడుకుకి యుద్ధ సాధన నేర్పించింది. అందుకే ధైర్యంగా సవాలు విసిరింది. 'నా సంతతిని జయించిన వారికి నా పదవి అప్పగించి విశ్రాంతి తీసుకుంటాను!' అని ప్రకటించింది.
తామే సైన్యాధికారి కావాలనే కోరికతో రాజుగారైన సింహం ముందు కోతులన్నీ పోటీకి దిగాయి. సైన్యాధికారి కొడుకును చూసి 'అవిటివాడు ఏమి చేయగలడు?' అంటూ నవ్వుకున్నాయి. పోటీలు మొదలయ్యాయి. 'ఎవరైతే వరుసగా ఉన్న ఈ వంద చెట్లను దాటుకుని వెళ్ళి రాజుకు ఆ చివరచెట్టులోని పండు తీసుకొచ్చి ఇస్తారో? వారే ఈ పదవికి అర్హులు' అని అధికారులు తీర్మానాన్ని ప్రకటించాయి. వేగంగా అన్ని కోతులూ ప్రయత్నం మొదలెట్టాయి. కానీ కొద్దిదూరం వెళ్లేసరికే అలసిపోయి, పోటీ నుంచి విరమించుకున్నాయి. కానీ రోజూ సాధన చేస్తూ ఉండడంతో అవిటిదైన కోతికి వంద చెట్లు దాటడం కష్టం అనిపించలేదు. అవలీలగా దాటి, పండును కోసి రాజుకు తెచ్చిచ్చింది. కోతి ఆత్మవిశ్వాసాన్ని చూసి ముచ్చటపడిన సింహం దానిని విజేతగా ప్రకటించి, సైనికాధ్యక్షునిగా నియమించింది. అక్కడే ఉన్న జంతువులన్నీ చప్పట్లతో అభినందనలు తెలియచేశాయి. హేళన చేసిన సహ జంతువులు సిగ్గుతో తలవంచుకున్నాయి.
అవిటితనం శరీరానికే కానీ, మనసుకు, ప్రయత్నానికి కాదని అన్ని జంతువులకు అర్థమయ్యేలా వివరంగా చెప్పింది సింహం. కొత్త సైన్యాధిపతి పర్యవేక్షణలో అడవిలోని జంతువులన్నీ నిర్భయంగా జీవించసాగాయి.

- ఎస్‌. దివ్యలక్ష్మి
97048 16177