ప్రజాశక్తి - గార: సాధనతోనే సత్ఫలితాలు వస్తాయని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పోర్టు కళింగపట్నం శ్రీ బుద్ధా స్కూల్, జిల్లా పాఠశాల క్రీడా సంఘం సంయుక్తంగా నిర్వహించిన 76వ అంతర పాఠశాలల జోనల్ గ్రిగ్స్ పోటీలను కళింగపట్నంలో మంగళవారం ప్రారంభించారు. ఈనెల 24వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో శ్రీకాకుళం, నరసన్నపేట నియోజవర్గాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయని, శారీరక దృఢత్వంతో పాటు మనో వికాసానికి దోహదపడతాయని చెప్పారు. గ్రామీణ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తి ముఖ్యమన్నారు.