ప్రజాశక్తి - గుంటూరు : దీర్ఘకాలికంగా పంటలు సాగు చేస్తున్న రైతే పెద్ద శాస్త్రవేత్త అని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. నూతన సాగు యాజమాన్య పద్ధతులను అవలంభిస్తూ భూసారన్ని కాపాడుతూ నాణ్యమైన అధిక దిగుబడులను సాధించాలని రైతులకు సూచించారు. ఏరువాక పౌర్ణమిలో భాగంగా గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. నాగేంద్ర స్వామి పుట్ట క్షేత్రంలో జెసి స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. ట్రాక్టర్ నడుపుతూ కొద్దిసేపు పొలం దున్ని విత్తనాలు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తమది వ్యవసాయ కుటుంబమని, తన తండ్రి రైతు అని చెప్పారు. విద్యార్థి దశలో సెలవుల సమయంలో వ్యవసాయ పనుల్లో పాల్గొన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. పంటల సాగులో రైతుల కష్టాలు తనకు తెలుసని, రైతులకు అధికారికంగా అందించాల్సిన సహాయంపై ఎల్లప్పుడు ముందుంటామని అన్నారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచనల ప్రకారం పంటలు మార్పిడి విధానాన్ని అమలు చేస్తూ భూసారాన్ని కాపాడాలన్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగం, మిశ్రమ పంటల సాగు ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించొచ్చని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. జొన్నలగడ్డ తొలిసారిగా మెట్ట వరిని ప్రయోగాత్మకంగా సాగు చేసి సఫలీకృతమై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మెట్ట వరిని సాగు చేసే ఘనత సాధించిందన్నారు. ఎపిసిఎన్‌ఎఫ్ డిపిఎం రాజకుమారి మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు పంట ఉత్పత్తులు నాణ్యత ఉండవన్నారు. అనంతరం రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను జెసి అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ టి.శ్రీనివాసరావు, తూర్పు మండల తహశీల్దార్ నగేష్, జొన్నలగడ్డ ఉప సర్పంచ్ నవీన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.










