ప్రజాశక్తి - భీమడోలు
భీమడోలు శ్రీచైతన్య పాఠశాల ఎస్‌పిఎల్‌గా 9వ తరగతి విద్యార్థులు జి.రుత్విక్(బాలురు), ఇరగవరపు శ్రీనిధి(బాలికలు) ఎన్నికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.సోహిని తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన ఎన్నికలకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చీఫ్ ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు సాధారణ ఎన్నికలను పరిచయం చేసే విధంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టామన్నారు. ఇదే క్రమంలో పదవుల కేటాయింపులో బాలురు, బాలికలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఎన్నికల విషయానికొస్తే ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకూ కొనసాగుతున్నాయన్నారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌పిఎల్, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు డిప్యూటీ ఎస్‌పిఎల్ పదవులను ప్రత్యేకించామన్నారు. 9వ తరగతి నుంచి నలుగురు, ఎనిమిదవ తరగతి నుంచి నలుగురుతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఎనిమిదవ తరగతి విద్యార్థి పోటీ చేశారన్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే ఓటర్ లిస్ట్ ప్రకటన, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ సందర్భంగా గుర్తింపు కోసం ఓటరుకు ఇంక్ మార్కు వేయుట, రహస్య ఓటింగ్ నిర్వహణకు బ్యాలెట్ బాక్స్ వినియోగం వంటి కార్యక్రమాలను చేపట్టామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు వేరు, వేరుగా గుర్తులు కేటాయింపు చేశామన్నారు. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచారం కోసం రంగంలో ఉన్న అభ్యర్థులకు తగు సమయాన్ని కేటాయించామన్నారు. ఆ తరువాత ఉపాధ్యాయుల పర్యవేక్షణ, నిఘాల మధ్య పోలింగ్ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఓట్ల లెక్కింపు పూరైన తర్వాత గెలుపొందిన అభ్యర్థుల వివరాలు ప్రకటించామన్నారు. డిప్యూటీ ఎస్‌పిఎల్‌గా ఎనిమిదవ తరగతి విద్యార్థి ఎస్.దినేష్ కుమార్(బాలురు), అల్లూరి ప్రణవి చౌదరి(బాలికలు) ఎన్నికయ్యారని తెలిపారు. ఎస్‌పిఎల్‌తో పాటు డిప్యూటీ ఎస్‌పిఎల్‌గా గెలుపొందిన విద్యార్థులను అకాడమిక్ డీన్ వి.భార్గవ కిరణ్, ఎఒ ముఖేష్ కుమార్‌తో పాటు పాఠశాలకు చెందిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.










