ప్రజాశక్తి- సీతమ్మధార: సమాజ సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీసిన సినిమాలకు అవార్డులు రావడం ఆనందంగా ఉందని కామెడీ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి ఏమండీ ఈశ్వరరావు అన్నారు. తన దర్శకత్వంలో నాగలక్ష్మి నిర్మించిన షాడో లఘు చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల లఘు చిత్రాల పోటీల్లో అవార్డు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఈ నెల 18న ప్రగతినగర్ సుందరయ్య భవన్‌లో పిన్ టీవీ నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో లఘు చిత్ర దర్శక నిర్మాతలు ఈశ్వరరావు, నాగలక్ష్మి ప్రముఖ నటుడు భానుచందర్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలను తీసి, ప్రజలను జాగృతం చేయడం ఎంతో విశేషమని, ఇలాంటి మరిన్ని చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తూ తమను అభినందించారని ఈశ్వరరావు తెలిపారు.
కాగా తన దర్శకత్వంలో ఆసిప్రియ క్రియేషన్స్ బ్యానర్లో ఇదివరకు నిర్మించిన స్త్రీశక్తి, ద ఆర్నమెంట్, విలువలు చిత్రాలకు కూడా జాతీయస్థాయిలో ఒకటి, రాష్ట్ర స్థాయిలో మూడు అవార్డులు వచ్చాయని ఈశ్వరరావు తెలిపారు. సమాజానికి ఉపయోగపడే మరిన్ని సినిమాలు నిర్మించడమే తన లక్ష్యమని, సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.










