Aug 23,2023 23:53

ప్రజాశక్తి - మంగళగిరి, తాడేపల్లి రూరల్‌ : షార్జా యూనివర్సిటీలో యూఏఈ వేదికగా ఈనెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు మొదటిసారిగా జరిగిన ఏషియన్‌ యూనివర్సిటీస్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్షిప్‌ పోటీల్లో మంగళగిరికి చెందిన షేక్‌ సాదియా ఆల్మాస్‌ నాలుగు బంగారు పతకాలు, స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో షార్జా నుండి గన్నవరం విమానాశ్రయానికి బుధవారం వచ్చిన సాదియా ఆల్మాస్‌కు మంగళగిరి పవర్‌ లిఫ్టర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి విజయభాస్కరరావు, కోచ్‌ షేక్‌ సంధాని, కెఎల్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ డిపార్ట్మెంట్‌ ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. సాదియా ఆల్మాస్‌ కెఎల్‌యు విద్యార్థిని కావడంతో వడ్డేశ్వరంలోని కెఎల్‌యు క్యాంపస్‌ నుండి ఎంబిఎ విబాగాధిపతి డాక్టర్‌ కె.హేమదివ్య అధ్వర్యంలో రెండు బస్సుల్లో విద్యార్థులు, అధ్యాపకులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని సాదియాకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాదియాను వర్శిటీలోని విసి చాంబర్‌కు ఊరేగింపుతో తీసుకువచ్చారు. వర్శిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు ఆమెను సత్కరించారు. తమ యూనిర్శిటీలో ఎంబిఎ ప్రథమ సంవత్సరం చదువుతున్న సాదియా అల్మాస్‌ విజయం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. మన రాష్ట్రంలో ఇంతటి ఘనత సాదించిన ఏకైక ఫవర్‌ లిప్టింగ్‌ క్రీడాకారిణి సాదియా మాత్రమే అని పేర్కొన్నారు. సాదియాను వర్శిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ జి.పార్ధసారదివర్మ, ప్రో వైస్‌ చాన్సలర్లు డాక్టర్‌ ఎవిఎస్‌. ప్రసాద్‌, డాక్టర్‌ ఎన్‌.వెంకట్‌ రామ్‌, ఎం.హెచ్‌ఎస్‌.డీన్‌ డాక్టర్‌ ఎం.కిషోర్‌బాబు, విద్యార్థి సంక్షేమ విబాగాధిపతి డాక్టర్‌ సిహెచ్‌.హనుమంతరావు, సలహాదారు డాక్టర్‌ హబీబుల్లాఖాన్‌, క్రీడల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ కె.హరికిషోర్‌, పీడీలు అభినందించారు. సాదియా ఆల్మాస్‌ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన కేఎల్‌ యూనివర్సిటీ యాజమాన్యానికి, ఇండియా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జె జోసెఫ్‌, సౌత్‌ ఇండియా కార్యదర్శి ఎస్‌ కోటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు ఎం.ప్రభాకర్‌, గౌరవ అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లుకు కతజ్ఞతలు తెలిపారు.