
'అమ్మా హైమా! నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి సుమా! నువ్వు మంచిపేరు తెచ్చుకొని, నాన్నకి కూడా మంచిపేరు తెచ్చిపెట్టాలి. నాన్న కూడా వారానికోసారి వచ్చి నిన్ను చూసి పోతూ వుంటారులే.' అంది తల్లి హితవు బోధిస్తూ.
'చాల్లేవే ఎన్నిసార్లు చెప్తావు? పదమ్మా హైమా, ఫస్టు బస్సు అందుకోవాలి మనం. లేకపోతే సమయానికి చేరుకోలేము.' అంటూ హడావిడిపడుతూ, హడావిడి పెట్టేస్తున్నాడు శర్మ.
అది ఒక కుగ్రామం. రామశర్మ ఆ గ్రామంలో ఎలిమెంట్రీ స్కూల్లో హెడ్ మాస్టరుగా పనిచేస్తున్నాడు. ఉభయ భాషా ప్రవీణుడు. ఆయుర్వేద వైద్యంలో కూడా ప్రవేశం వుంది. అందుచేత విద్యారంగంలోనేగాక వైద్య రంగంలోనూ మంచిపేరు సంపాదించుకున్నాడు. ఏడో తరగతి వరకూ హైమావతి తన స్కూల్లోనే చదివింది. సొంత కూతురైనా స్కూల్లో మాత్రం నిస్పక్షపాతంగా వ్యవహరించేవాడు. అదీ అతని ప్రత్యేకత. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేకపోవడం వల్ల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లిలో జాయిన్ చెయ్యడానికి ఆ రోజు తీసుకెళ్తున్నాడు. ఆ వూళ్ళో వాళ్ల అత్తయ్య వాళ్లు ఉంటున్నారు. వాళ్లింటిలోనే అమ్మాయికి బస కూడాను. కాబట్టి అమ్మాయి ఎలావుంటుందో అన్న బెంగ లేదు తనకి.
అనకాపల్లి చేరుకునేసరికి ఉదయం ఎనిమిదిన్నర అయింది. తొమ్మిది గంటలకల్లా స్కూలుకి చేరుకున్నారు. హెడ్ మాస్టరు తనకి బాగా తెలిసున్న వ్యక్తి కదా..! అని నేరుగా తననే కలుద్దామని అతను రూమ్‌కి చేరుకున్నాడు శర్మ. నేంప్లేటు మీద ఉన్న పేరు చూసి ఖంగుతిన్నాడు శర్మ. బోగట్టా చేశాడు. పాత హెచ్.ఎం గారికి ట్రాన్స్‌ఫÛర్ అయిపోయిందని.. కొత్తగా రవివర్మ వచ్చారని తెలిసింది. పేరు ఎక్కడో విన్నట్టుందే అని అనుకుంటూ అతని రాకకై వేచి వున్నాడు.
హెచ్‌ఎంగారు వచ్చారని తెలిస్తే.. తనని కలుసుకోడానికి లోనికి ప్రవేశించాడు శర్మ. అతనిని చూడగానే 'ఓరి వర్మా.. నువ్వట్రా..!' అని వెళ్ళి కౌగలించుకున్నాడు. అతను కూడా ఆశ్చర్యపోయి 'అరె...! శర్మా! నువ్వా.. అంటూ చాలా ఆనందపడిపోయాడు. ఇద్దరూ ఇంటర్ వరకూ క్లాసుమేట్లు. తరువాత వాళ్ల తండ్రుల ఉద్యోగాలరీత్యా విడిపోయారు. అవి సెల్‌ఫోను లేనిరోజులు. కొన్నాళ్లు ఊత్తర ప్రత్యుత్తరాలు సాగాయి.. వారిరువురి మధ్యా. తరువాత విధి నిర్వహణలో పడి అవి కూడా ఆగిపోయాయి. దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత వారిరువురూ కలుసుకున్నారు. వర్మ చాలా తెలివైనవాడే, కానీ తెలుగు సబ్జెక్టులో చాలా వీకు. శర్మ మాత్రం తెలుగులో పద్యాలు అనర్గళంగా చదివేవాడు. తనకి కూడా నేర్పమని వర్మ కోరితే నేర్పేవాడు. కానీ అప్పుడప్పుడు విసుగొచ్చి తిట్టేవాడు.
'ఒరేరు.. నీ పేరు వర్మ. నా పేరు శర్మ. నీకు పద్యం నేర్పడం నా ఖర్మ!' అని అంటూ ఉండేవాడు. ఆ పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ.. అరగంట వరకూ అలుపెరగకుండా మాట్లాడుకుంటూ కష్టసుఖాలు చెప్పుకున్నారు ఇరువురూ. తరువాత అసలు విషయం చెప్పాడు శర్మ.
అంతా విని.. 'ఏం ఫర్వాలేదురా.. ఇక నేను చూసుకుంటాను. నువ్వు దిగులుపడనవసరం లేదు. అన్నట్టు.. వైజాగ్‌లో పనేదో ఉందన్నావు కదా! అది చూసుకొని, నేరుగా ఇక్కడికి వచ్చెరు. సాయంత్రం మా ఇంటికి వెళదాము. రాత్రికి మా ఇంట్లో భోజనం చేసి, మీ వాళ్ల ఇంటికి వెళుదువుగాని' అన్నాడు వర్మ.
వైజాగ్ నుండి తిరిగొచ్చేసరికి సాయంత్రం నాలుగయ్యింది. అప్పటికే స్కూల్లో జాయిన్ చేసే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యి, పాప క్లాసులో ఉన్నట్టు చెప్పాడు వర్మ. హైమా ఫారం పరిశీలిస్తూ అకస్మాత్తుగా చూసి అన్నాడు.
''ఔనురా శర్మా! నాకు తెలియకుండా నువ్వెప్పుడు వెళ్ళేవురా ''అస్సాం''కి. 'నేను అస్సాంకి వెళ్లడమేంటిరా, జోకా? అనకాపల్లి కూడా దాటి, నేను ఏనాడూ వెళ్లందే' అన్నాడు.
'మరి మీ అమ్మాయేమిట్రా.. ఫారంలో జన్మస్థలం ''అస్సాం'' అని రాసింది...? 'ఏది చూపించు..?' అని ఫారం చూశాడు.
'ఒరేరు.. నువ్వు ఇప్పటికీ తెలుగులో వీకేనన్నమాట. సరిగా చూడు ఏం రాసిందో..' అన్నాడు నవ్వుతూ శర్మ.
'ఔను...''అసామ'' అని రాసింది కదట్రా.. మకారపొల్లు పెట్టలేదు.. తను కూడా తెలుగులో వీకనుకుంటా' అన్నాడు వర్మ నవ్వుతూ.
'ఒరేరు...అది నా కూతుర్రా...మిగతా సబ్జెక్టుల్లో వీకవచ్చుగానీ తెలుగులో మాత్రం కాదురా' అన్నాడు శర్మ.
'మరి ఈ ఊరెక్కడుందిరా బాబూ.. నేను జన్మలో వినలేదు.' అడిగేడు వర్మ.
'అదొకపెద్ద కథరా బాబూ.. ఇంటికి వెళ్లాక సావకాశంగా చెబుతాను.' అన్నాడు శర్మ.
త్వరగా పని పూర్తిచేసుకొని, కారులో తన ఇంటికి తీసుకెళ్లేడు వర్మ. తోవలో ఆన్నాడు శర్మ.
'కారెప్పుడు కొన్నావురా..! బాగుంది.'
'అన్నట్టు నేను చెప్పలేదు కదూ...నా భార్య డాక్టర్రా.. ఈ ఊర్లోనే గవర్నమెంటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్. తను కొందిరా ఈ మధ్యే...
తను నా మేనమామ కూతురే.' అన్నాడు.
ఇంటికి చేరుకోగానే... భార్యని పిలిచి అన్నాడు వర్మ ''చూడు ఎవరొచ్చారో...అన్నట్టు నీకు తెలియదు కదూ...ఇతను రామశర్మ అని నా చిరకాల మిత్రుడు. ఇంటర్‌లో మేమిద్దరం క్లాసుమేట్స్.. చాలా కాలం తరువాత కలుసుకున్నాం. ఈ పాప వీళ్ల అమ్మాయి. మా స్కూల్లో జాయిన్ అయ్యింది. ఈ రోజే.'' అంటూ పరిచయం చేశాడు వర్మ. నమస్కరిస్తూ కూర్చోమని ఆహ్వానించింది ఆమె. ప్రతి నమస్కారం చేస్తూ డాక్టరు అయివుండికూడా ఎంత వినయం ఆమెకు.. అనుకున్నాడు శర్మ మనసులో.
''మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి.. నేను కాఫీ తీసుకొస్తాను ''అంటూ లోనికి వెళ్లిపోయింది. పాపను కూడా ఆమె తనతో పాటూ తీసుకెళుతూ...కాస్సేపు పిచ్చాపాటీ అయిన తరువాత 'ఔనూ...ఇందాక ''అస్సాం'' సంగతి చెప్తానన్నావు...!' అన్నాడు. తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ వర్మ.
'ఔనురా... అది నా జీవితంలో జరిగిన మరువలేని ఘటన. అలాంటి ఘటన ఎవరి జీవితంలోనూ జరగకూడదని భావిస్తాను. నిజానికి అ ఘటన జరిగినప్పుడు నేనక్కడ లేను. పాపం మా మామగారు ఒక్కరే యమ యాతన అనుభవించారు.'
'ఏం జరిగిందిరా ఇంతకీ?' ఆతృతగా అడిగాడు వర్మ.
పుష్కరకాలం క్రితం జరిగిన సంఘటన చెబుతూ... గతంలోకి వెళ్లిపోయేడు శర్మ.
***
అమ్మాయిని పురిటికి పుట్టింటికి రాజమండ్రి తీసుకెళ్లడానికి వారం రోజుల్లో వస్తున్నట్లు ఉత్తరం రాశారు. శర్మకి వాళ్ల మావగారు. అది రెండో కానుపు. కొన్ని అనివార్య కారణాల వల్ల తొమ్మిదో నెల వచ్చే వరకూ తీసుకెళ్లడం కుదరలేదు తనకి. స్కూల్లో పరీక్షలు అవుతూ ఉండడం వల్ల శర్మకి తోడు వెళ్లడం కుదరలేదు. అయితే మూడు గంటల ప్రయాణమే కదా..! జాగ్రత్తగా తీసుకెళ్లిపోవచ్చని తను ఒక్కరే వచ్చేరు తీసుకెళ్ళడానికి. శర్మ పెద్దపాప వయసు రెండు సంవత్సరాలు. ఇంట్లో మరో ఆడదిక్కు లేకపోవడం వల్ల ఆ పాపతో సహా ప్రయాణమయ్యారు శర్మ మావగారు.
గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉండడం వల్ల స్టేషన్ చాలా రద్దీగా వుంది. గోదావరీ ఎక్స్‌ప్రెస్స్ కూడా కిటకిట లాడుతూ వచ్చింది. ఎలాగో అమ్మాయినీ, మనుమరాలినీ ఎక్కించి తను ఎక్కుతూ వుండగానే బండి బయలుదేరిపోయింది. వాళ్ళకి చోటు ఇప్పించారుగానీ తను మాత్రం నిల్చొనే ప్రయాణం సాగిస్తున్నారు. యలమంచిలి దాటిన కాస్సేపటికే అమ్మాయి అసహనానికి గురవ్వసాగింది. ఆ విషయం తండ్రితో చెప్పింది. ఆయన లోలోపల ఆందోళన చెందుతున్నా వ్యక్తపరచకుండా కాస్త ఓపిక పట్టమని ధైర్యం చెప్పసాగారు. అమ్మాయి చుట్టుపక్కల కూర్చున్న వాళ్లంతా మగవాళ్లే.. వాళ్లలో చాలామంది విద్యార్థులూ ఉన్నారు. అమ్మాయి తన బాధ చెప్పుకుందామన్నా ఒక్క ఆడపురుగూ లేదు చుట్టుపక్కల. 'తుని' దాటిన కాసేపటికి నొప్పులు ప్రారంభమయ్యాయి అమ్మాయికి. ఏం చెయ్యాలో తోచని స్థితిలోఉన్నారు తండ్రీ కూతుళ్ళు. తొమ్మిదోనెల వచ్చాక... అదీ ఆడ సాయం లేకుండా ఒక్కడినే ఎందుకింత సాహసం చేశానా అని అతడు భయపడసాగారు. ఈ బాధలతో తనకు ఏ సంబంధం లేనట్టు మనుమరాలు కనబడినవన్నీ కొనిపెట్టమని మొరాయిస్తూనే ఉంది. ఎటూ కాకుండా తోవలో ఉండిపోయామన్న భయం ఓతన్న వేధిస్తోంది. ప్రసవ వేదన భరించే స్థాయి దాటిపోవచ్చింది. అమ్మాయికి ధైర్యం చెప్పినా ఇక లాభం లేదనిపించింది. చుట్టుపక్కనున్న కొంతమందిని లేచి సీట్లు ఖాళీ చేెసి సహకరించమని కోరినా, ఎవరూ సహకరించలేదు. నిమ్మకి నీరెత్తనట్లు కూర్చునే ఉన్నారు. మంచిగా చెప్పినా సహకరించకపోతే.. భరించలేక చేతికి పని చెప్పాల్సి వచ్చింది కూడాను. దూరంగా కింద కూర్చొని అంతా గమనిస్తూ ఉన్న ఒక రైతు లేచి వచ్చాడు.
'ఏటి బాబూ ఇందాకటి నుంచి సూత్తూనే ఉన్నాను. ఆ పెద్దాయన అంత బతిమిలాడుతున్నా మీకు బుర్రలు లేవేటి..? సదువుకున్న మూర్కులులాగున్నారు. లెగండి ముందు.' అంటూ వాళ్ల రెక్కలు పట్టుకొని ఈడ్చిపడేసి సీట్లు ఖాళీ చేయించి, అమ్మాయిని పడుకోబెట్టి, తన సంచీలోంచి రెండు పంచెలు తీసి తెరగా కట్టాడు పాపం. ఆ బోగీలో ఎక్కడైనా ఆడ మనిషి పెద్దావిడ ఉన్నారేమోనని వెతికేరు ఆయన. కానీ ఎవ్వరూ లేరు. ఇంతలో 'అన్నవరం' వచ్చింది. ఎవరో ఒక అమాయి ఎక్కింది ఆ బోగీలోకి. అన్నవరం సత్యనారాయణ స్వామే పంపి వుంటాడని భావించి, పరిస్థితి వివరించారు. అదృష్టవశాత్తూ ఆమె మెడికల్ స్టూడెంట్. ఇంకా హౌసర్జన్ చేస్తోందట. పురుడు పోసే అనుభవం ఆమెకు లేకపోయినా ఆమె ప్రస్తుతం దైవంతో సమానం అని భావించారు. తనకున్న జ్ఞానాన్నంతా తెరచాటున చూపించే ప్రయత్నంలో ఉందామె. చదువుకున్న మూర్ఖుల్లో మహా మూర్ఖుడు ఒకడు తెరచాటున ఏం జరుగుతోందో తొంగి చూసే ప్రయత్నంచేసి, తన్నులు తిన్నాడు. కానుపు అయిపోయింది. ఆడపిల్ల పుట్టిందని, మిగతా తతంగాలు ఆస్పత్రిలో జరపాల్సిందేనని, ఇక్కడ సాధ్యం కాదని చెప్పింది ఆ డాక్టరు అమ్మాయి. దేవతలా వచ్చి సాయం చేసిన ఆ అమ్మాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తన పేరు, తండ్రి పేరు కనుకున్నారాయన. తన పేరు నిర్మల అని, తన తండ్రి పేరు రాఘవరావు గారని చెప్పింది. మిగతా విషయాలు తెలుసుకొనేలోపు 'సామర్లకోట' స్టేషన్ వస్తే హడావిడిగా దిగి, వెళ్లిపోయిందామె. ఎవరు అందజేశారోగానీ.. సామర్లకోట స్టేషన్ మాస్టర్‌కి కబురు అందినట్టు, రాజమండ్రి స్టేషన్‌లో లేడీ డాక్టరు తదుపరి సేవలందించడానికి రడీగా ఉన్నట్లు... వార్త తెలిసింది. సెల్ ఫోన్ లేని రోజులవి. ఎవరికీ కబురు అందజేయలేని పరిస్థితి.
×××
'స్టేషన్ నుండి నేరుగా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్‌కే తీసుకెళ్లడం జరిగింది. ఆ తరువాత ఆ అమ్మాయే... ఇదుగో నీ స్కూల్లో ఈరోజు జాయిన్ చెయ్యడం జరిగింది.' అని చెప్పడం ముగించేడు శర్మ.
'అయితే నా ప్రశ్నకి జవాబు దొరకలేదురా..' అన్నాడు వర్మ .
'అంటే..!'
'అదేరా...''అసాం'' అని నసిగాడు వర్మ.
'ఓ.. అదా..! అది అసాం కాదు, 'అ.సా.మ.' అని చెప్పేనా.. ఇంకా అర్థం కాలేదా నీకు? అదే రా..''అన్నవరం...సామర్లకోట.. మధ్య'' అని దాని అర్థం. తెలిసిందా..?' అన్నాడు పకపకా నవ్వుతూ.
'అయితే అన్నయ్యగారూ...ఆ అమ్మాయి పేరు, వాళ్ల నాన్నగారి పేరు తప్ప ఇంకే విషయాలూ మీకు తెలియవా..?' అని అడిగింది వర్మ భార్య ఈ కథంతా విని.
'లేదమ్మా అదే మా బాధ. మిగతా విషయాలు తెలుసుకునేలోపు స్టేషన్ వచ్చిందని దిగి వెళ్లిపోయిందట ఆ అమ్మాయి. ''ఏ ఊరో కూడా కనుక్కోలేకపోయానోరు శర్మా..!'' అంటూ మా మావగారు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.' అన్నాడు శర్మ.
'ఇక ముందు మీరెవరూ బాధ పడనవసరం లేదు అన్నయ్యగారు... ఎందుకంటే ఆ అమ్మాయి మీ ముందే కూర్చొని ఉంది.' అంది నవ్వుతూ ఆమె.
'ఆ..' అని ఆశ్చర్యపోయారు శర్మ, వర్మ ఒకేసారి.
భాగవతుల సత్యనారాయణ మూర్తి